మోర్తాడ్/వేల్పూర్, జూన్ 18: రేవంత్‌రెడ్డి తుగ్లక్ పాలన వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో అంక్సాపూర్ గ్రామంలో ప్రారంభమైన రైతుల నిరసన జ్వాలలు మోర్తాడ్, దొన్కల్, ధర్మోరా, మోర్తాడ్, కమ్మర్పల్లి, బడాభీమ్‌గల్, వేల్పూర్ వంటి గ్రామాలకు విస్తరించాయని, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనూ, రైతులు స్వచ్ఛందంగా రాస్తారోకోలు చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారన్నారు. యూరియా యాప్ రద్దు చేయాలని, ఎకరానికి 4 సంచుల చొప్పున ఒకేసారి యూరియా ఇవ్వాలని, పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే రోడ్డుపై బెఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్న నేడు కడుపుమంటతో, ఆవేదనతో రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితిని ఈ రాక్షస ప్రభుత్వం, దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారని వేముల ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు ప్రతి చిన్న అవసరానికి, హక్కుల కోసం రోడ్లెక్కి కొట్లాడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు వడ్ల కొనుగోలు కోసం రోడ్డెక్కాల్సి వస్తే, ఇప్పుడు యూరియా కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా పంపిణీలో డిజిటల్ యాప్ పేరుతో కొత్త నిబంధనలు తీసుకొచ్చి రైతులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నదని విమర్శించారు. యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 4సంచుల చొప్పున యూరియాను ఒకేసారి అందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో సొసైటీలు డిఫాల్ట్ అయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు సాకులు వెతుకుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ వేధింపుల చర్యల్లో భాగంగా ఇప్పటికే సొసైటీ చైర్మన్లపై మూడుసార్లు ప్రత్యేక ఆడిట్ నిర్వహించినప్పటికీ, ఎలాంటి అవకతవకలు తేలలేదన్నారు. 2014కు పూర్వపు కాంగ్రెస్ ప్రభుత్వహయాంలోనే ఆ బకాయిలు ఉన్నట్లు ఆడిట్లో స్పష్టమైందని గుర్తు చేశారు.
ఒకవేళ సొసైటీలపై ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని, కానీ దాన్ని సాకుగా చూపి రైతులకు ఎరువులను నిలిపివేయడం దుర్మార్గమన్నారు. డీఫాల్ట్ కాని సొసైటీల్లో, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో కూడా యూరియా ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి తప్పడు ఆరోపణలు చేస్తున్నారని, బాల్కొండ రైతాంగం అంత అమాయకులు కారని హితవు పలికారు. గతంలో రూ. 1200గా ఉన్న 20-20 ఎరువుల బస్తా ధర నేడు ఏకంగా రూ.2,150కి, జీలుగ రూ.1450 నుంచి ఏకంగా రూ.2,450కి పెంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచిందని ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో విషయాన్ని తెలుసుకుని అడిషనల్ కలెక్టర్ కిరణ్‌కుమార్ వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్దకు వచ్చి వేముల ప్రశాంత్‌రెడ్డితో మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యేతో మాట్లాడించారు. యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయడంతో పాటు ఎకరానికి 4 బస్తాల యూరియాను సకాలంలో అందేలా చూడాలని, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అలాగే, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్రానికి లేఖ రాయాలని కోరగా, అందుకు కలెక్టర్ అంగీకరించడంతో ఆందోళన విరమించారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో హైవేపై బైఠాయిస్తామని ఎమ్మెల్యే అనడం, పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. రైతుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో చివరకు ఆందోళన విరమించారు.
కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారమే జిల్లాలో మొత్తం 3 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 1.50 లక్షల మందికి మాత్రమే 4 లక్షల యూరియా సంచులను పంపిణీ చేశారని, అంటే ఒక్కోరైతుకు రెండు సంచులు కూడా సరిగా అందలేదని ఎద్దేవా చేశారు. మిగిలిన 1.50 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు ఒక్క సంచి కూడా అందలేదన్నారు. జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నదని, ఎకరానికి కనీసం 4 సంచుల చొప్పున లెక్కించినా ఒకే పంట కాలానికి 24 లక్షల సంచుల యూరియా అవసరమవుతుందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు 4 లక్షల సంచులు మాత్రమే ఇచ్చి, ఇంకా 20 లక్షల సంచుల కొరత ఉండగా స్టాక్ఫుల్ ఉందని ప్రకటించడం అధికారుల బాధ్యాతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.