నిజాంసాగర్, మార్చి 28: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సమస్యలు రోజురోజుకూ మరింత తీవ్రమవుతున్నాయి. ఒకవైపు రాత్రిపూట కరెంట్ సరఫరా చేస్తుండడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు పగటిపూట లో వోల్టేజీ కారణంగా ప్రజలు సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముదిరిన తరుణంలో నిరంతర కరెంట్ సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. గతంలో సుమారు 18 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేసే వారు. అయితే, ఇప్పుడది 12 గంటల నుంచి 16 గంటల్లోపే పరిమితం కావడం, మరోవైపు సాంకేతిక కారణాల వల్ల సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతుండడం సాగుకు ఇబ్బందికరంగా మారిందని రైతులు వాపోతున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు కరెంట్ ఇస్తుండడంతో నిద్ర కరువవుతున్నదని చెబుతున్నారు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసే వారు. కరెంట్ రెప్పపాటు కూడా పోకపోయేది. దీంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం విడుతల వారీగా 16 గంటల పాటే సరఫరా చేస్తుండడం, అది కూడా అర్ధరాత్రి 12 గంటల నుంచి కరెంట్ ఇస్తుండడం ఇబ్బందికరంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట పొలాల వద్దే జాగారం చేయాల్సి వస్తున్నదని చెబుతున్నారు. మరోవైపులో వోల్టేజీ సమస్య కూడా వెంటాడుతున్నదని వాపోతున్నారు. లోవోల్టెజీ కారణంగా ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు సైతం పని చేయకపోవడం వల్ల ఉక్కపోతతో సతమతమవుతున్నామని చెబుతున్నారు.
యాసంగి పంటల సాగు చివరికొచ్చింది. ఇప్పు డే నీళ్లు బాగా అవసరమైతయ్. దీంతో విద్యుత్తు వినియోగం అధికంగా ఉండడంతో లోవోల్టెజీ సమస్య ప్రారంభమైంది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు ముదరడంతో కరెంట్ కష్టాలు ఎక్కువవుతున్నాయి.
– విఠల్‌గౌడ్, వొడ్డెపల్లి, నిజాంసాగర్
గతంలో 24 గంటల కరెంట్ ఉంటుండే. ఏ సమస్యలు లేకుండా పంటలు బాగానే పండించుకున్నారు. కానీ ఇప్పుడు 12 నుంచి 16 గంటలే కరెంట్ ఇస్తుండడం, విడుతల వారీగా రాత్రిపూట సరఫరా చేస్తుండడంతో సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రిపూట పొలానికి పోవాలంటే పరీక్షే. పురుగుపుట్రతోని ప్రమాదముంటది. విడుతల వారీగా నిరంతరం కరెంట్ సరఫరా చేయాలి.
– విఠల్‌రెడ్డి, చిన్నదడ్గి, బిచ్కుంద
ప్రభుత్వం కరెంట్ సమస్య లేకుండా చూడాలి. గతంలో వ్యవసాయానికి 18 నుంచి 24 గంటలూ సరఫరా చేసే వారు. ఇప్పుడు 12 నుంచి 16 గంటలే ఇస్తున్నారు. పైగా రాత్రిపూట కరెంట్ ఇస్తున్నారు. దీంతో పంటల సాగులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో త్రీ ఫేజ్ ఇవ్వడం వల్ల పొలాలకు వెళ్లడం చాలా కష్టమవుతుంది. ఇంట్లో మగదిక్కు లేని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది.
– నాగ్నాథ్, రైతు, మద్నూర్
ధర్పల్లి, మార్చి 28: కాంగ్రెస్ పాలనలో రైతు లకు ఒరిగిందేమీ లేదు. కేసీఆర్ హయాం లోనే అన్ని రకాలుగా బాగుండే. అప్పుడు కరెంట్ 24 గంటలు ఇస్తుండే. ఇప్పుడు రావ ట్లేదు. మళ్లీ అర్ధరాత్రి అపరాత్రి అనకుండా పొలాలకు వెళ్లి నీళ్లు పెట్టాల్సి వస్తుంది. రైతులకు ఇబ్బందులు తప్పట్లేవు. కేసీఆర్ మళ్లీ సీఎంగా వస్తేనే రైతులకు అన్ని రకాలుగా మేలు జరుగుతుంది.
– సోమశేఖర్, రైతు, మైలారం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు 24 గంటలూ నిరంతర విద్యుత్‌ను అందించాలి. రాత్రి 12 గంటల నుంచి త్రీఫేజ్ సరఫరా చేస్తున్నారు. దీంతో రాత్రివేళ పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. రైతుల అవసరాలకు అనుగుణంగా త్రీ ఫేజ్ విద్యుత్‌ను అందించాలి.
– నర్సింలు, రైతు, సంగోజీపేట్
నాకు మూడెకరాల పొలం ఉంది. పంటలకు సాగునీరు అందించేందుకు మూడు బోర్లు ఉన్నాయి. ప్రస్తుతం పంట పొట్ట దశకు వచ్చింది. రాత్రిపూట త్రీ ఫేజ్ కరెంటు సరఫరా చేస్తుండడంతో పొలం కాడనే ఉండాల్సి వస్తున్నది. రాత్రంతా నిద్ర లేకుండా పొలానికి నీళ్లు పెట్టాల్సి వస్తున్నది. ఆటోమోటిక్ స్టార్టర్ అన్ చేసినప్పటికీ, లో వోల్టెజీతో ఒక్కోసారి అది సతాయిస్తది. అందుకే రాత్రిపూట పోయి చూసుకోవాల్సి వస్తున్నది.
– సాయిలు, గోర్గల్, నిజాంసాగర్
ఇప్పుడు ఐదెకరాలు, ఆ పైనే ఉంటే పొలం పారుడు ఇబ్బందిగా మారింది. గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగినుండే. ఇప్పుడు అస్తవ్యస్త కరెంట్ సరఫరాతో రైతులకు కొంత ఇబ్బందిగా మారింది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు కరెంట్ గురించి చింత లేకుండే. కానీ కాంగ్రెస్ వచ్చాక సమస్యలు మొదలైనయ్. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతులను ఆదుకోవాలి.
– కె.శేఖర్‌రెడ్డి, రైతు, దుబ్బాక గ్రామం