జిల్లాలోని పలు గ్రామాల్లోని రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రయాణికులు ఈ రోడ్ల గుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలే గుంతలతో ఉన్న రోడ్లు.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. గుంతల్లో వర్షపు నీరు నిలిచి ఏ గుంత ఎంతలోతు ఉందో తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, రోడ్లపై గుంతలను పూడ్చివేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
సారంగాపూర్, అక్టోబర్ 1 : నిజామాబాద్-బోధన్ రహదారిపై సారంగాపూర్ గ్రామం వద్ద రోడ్డంతా కంకర తేలి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు మరింత అధ్వానంగా తయారైంది. ఈ రోడ్డు గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు, ఆటోడ్రైవర్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఈ రహదారిపై రోజుకు వేలాది సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తాయి. గుంతల వద్ద ట్రాఫిక్ స్తంభిస్తున్నదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు దుస్థితిపై పలుమార్లు బీఆర్ఎస్ నాయకుడు అక్బర్, గ్రామానికి చెందిన స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ప్రతినిధులు వేర్వేరుగా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. నిజామాబాద్-బోధన్ రహదారి నాలుగు లైన్ల బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంతవరకు పనులు ప్రారంభించడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చడంతోపాటు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ధర్పల్లి, అక్టోబర్ 1 : మండలకేంద్రం నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ఎంపీడీవో, తహసీల్దార్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధానరోడ్డు ధ్వంసమైనా పట్టించుకునే వారే కరువయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి ఎన్టీఆర్ కాలనీ, మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. గుంతల రోడ్డుపై నుంచి వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డును విస్తరించి, నూతనంగా వేసేందుకు గతేడాది రోడ్డు భవనాల శాఖ మంత్రి తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద శిలాఫలకం వేసినప్పటికీ ఇంతవరకు పనులు చేపట్టకపోవడం గమనార్హం. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కోటగిరి, అక్టోబర్ 1 : కోటగిరి నుంచి పొతంగల్ వెళ్లే ప్రధానరహదారిపై జల్లాపల్లి ఎక్స్ రోడ్డు వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. కోటగిరి నుంచి రుద్రూర్ వెళ్లే దారిలో కూడా గుంతలు ఉన్నాయి. ఈ దారి మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.