పదో తరగతి ఫలితాల్లో ఒకప్పుడు నిజామాబాద్ మొదటి స్థానంలో నిలిచేది. రాష్ట్రంలోనే ఇందూరు ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుండేది. రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా మన విద్యార్థులకే దక్కేవి. ఇంటర్లోనూ ఇందూరుకు తిరుగుండక పోయేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. ఉమ్మడి జిల్లా మొదటి నుంచి అధమ అట్టడుగు స్థానానికి పడిపోయింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విద్యాశాఖ పనితీరు ఏపాటిదో టెన్త్, ఇంటర్ ఫలితాలతో తేలిపోయింది. ఇంటర్లో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకోగా, నిజామాబాద్ 25వ స్థానంతో నవ్వుల పాలైంది. పదో తరగతి ఫలితాల్లోనూ ఉమ్మడి జిల్లాల పేలవ ప్రదర్శన పునరావృతమైంది.
– నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చదువుల నాణ్యత తీసికట్టుగా మారింది. అందుకే ఫలితాల్లో అట్టడుగు స్థానంలో ఉండాల్సిన దుస్థితి తలెత్తింది. ఉన్నతాధికారుల పట్టింపులేని తనం, విద్యాశాఖ, ఇంటర్ విద్యా శాఖల అధికారుల నిర్లక్ష్యం పేద, మధ్య తరగతి కుటుంబాలకు శాపంగా మారింది. నాణ్యమైన విద్యకు పునాది వేసి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ప్రభుత్వాధికారులు కనీసం పట్టించుకోక పోవడంతో ఈసారి పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న దుస్థితిని కండ్లకు కట్టింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు దారుణమైన ఉత్తీర్ణత శాతాలను సాధించాయి. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు కీలకమైన టెన్త్, ఇంటర్ విద్యలో ఉభయ జిల్లాలు చతికిల పడ్డాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సాధించిన దారుణమైన ఫలితాలు రాష్ట్ర స్థాయిలో రెండు జిల్లాల పరువును మంటగలిపాయి.
ఒకప్పుడు స్టేట్ ర్యాంకర్లతో రాష్ట్ర స్థాయిలో పేరుగాంచిన ఉమ్మడి జిల్లా ఈసారి అట్టడుగు స్థానాలతో అపకీర్తిని మూటగట్టుకున్నది. ఏప్రిల్ 22న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండు జిల్లాలు చిట్టచివరన నిలిచాయి. ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా ఆఖరి స్థానంతో, నిజామాబాద్ జిల్లా 25వ స్థానంతో నవ్వుల పాలయ్యాయి. ఏప్రిల్ 30న విడుదలైన పదో తరగతి ఫలితాలు ఉభయ జిల్లా అధికారుల పేలవమైన పనితీరుకు అద్దం పట్టాయి.
వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థుల సన్నద్ధతపై ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. ఉపాధ్యాయ సంఘాలతో టైమ్ పాస్ మీటింగ్లతోనే సరిపెట్టారు. విద్యార్థుల భవిష్యత్తును పక్కన పెట్టి చిల్లర పంచాయితీలతో కాలక్షేపం చేశారు. మరోవైపు, సన్నద్ధతలో కీలకమైన ఉపాధ్యాయులు సైతం డుమ్మా కొట్టారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ నాయకులతో పోటీ పడి ప్రచారాల్లో మునిగి తేలారు. సంఘాల పేరుతో జల్సాలు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో డీఈవోల పర్యవేక్షణ వైఫల్యం మూలంగా ఫలితాలు దారుణంగా వచ్చాయి. ఉన్నతాధికారులు సైతం సమీక్షలు చేయకపోవడంతో పట్టించుకునే వారే లేకుండా పోయారు.
పదో తరగతి ఫలితాలు ఉమ్మడి జిల్లా విద్యాశాఖ పనితీరును తేటతెల్లం చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలువకపోయినా, కనీసం గౌరవ ప్రదమైన స్థానాన్ని కూడా తెచ్చుకోలేక పోయాయి. ఇంతటి దారుణమైన ఫలితాలకు ఉపాధ్యాయుల పనితీరు, విద్యాశాఖ అధికారుల నిర్లిప్తత ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే మిగిలిన జిల్లాల కంటే ఉభయ జిల్లాలు అధమ స్థాయికి పడిపోయాయి. నిజామాబాద్ కంటే కామారెడ్డి జిల్లా స్థానం మరీ అట్టడుగుకు పడిపోయింది. జుక్కల్లో గణితశాస్త్రం పేపర్ లీకేజీ ఘటన తర్వాత జరిగిన పరీక్షల్లో ఎక్కువ మంది ఫెయిల్ అయినట్లు తెలిసింది. పేపర్ లీకేజీ వదంతులతో పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ, పోలీసులు ఉక్కుపాదం మోపడంతో చీటీలపై ఆధారపడిన ఉపాధ్యాయుల తెలివి తేటలకు దెబ్బ పడినట్లు తెలిసింది. పాఠాలు బోధించకుండా టైమ్ పాస్ చేస్తూ వార్షిక పరీక్షల్లో వక్రబుద్ధిపైనే ఆధారపడిన చాలా మంది టీచర్లకు ఈ ఫలితాలు మింగుడు పడటంపడటం లేదు.
టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా కూడా పేలవ ప్రదర్శన చేసింది. 96.62శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 16వ స్థానానికే పరిమితమైంది. జిల్లాలో 22,694 మంది పరీక్షలకు హాజరు కాగా 21,928 మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది పదో స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లా ఏకంగా 20వ స్థానానికి పడి పోయింది. ఇక్కడ 12,542 మంది పరీక్షలు రాయగా, 11,871 మంది పాసయ్యారు. విద్యాశాఖ వైఫల్యాలపై సమీక్ష చేసుకోవాల్సి ఉండగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే అందుకు భిన్నంగా ప్రవర్తించడం సిగ్గుచేటుగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు పదో తరగతి ఫలితాల్లో దక్కిన స్థానాలపై జిల్లా కలెక్టర్లు ఇరువురు అసంతృప్తితో రగిలి పోతుండగా, ఉన్నతాధికారులను మచ్చిక చేసుకునేందుకు పూలబొకేలతో శుభాకాంక్షలు తెలియజేయడం విచిత్రంగా మారింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ ఫలితాల్లో నిజామాబాద్, కామారెడ్డి చిట్టచివరన నిలిచాయి. నిజామాబాద్ జిల్లాలో 15,056 మంది ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా, 8,035 మంది (53.37శాతం) ఉత్తీర్ణులయ్యారు. 13,945మంది సెకండియర్ పరీక్షలకు హాజరవ్వగా 8,117 మంది (58.21శాతం) మాత్రమే పాసయ్యారు. ఇందూరు రాష్ట్ర స్థాయిలో 25వ స్థానంలో నిలిచింది. నాసిరకమైన బోధనకు ఈ ఫలితాలు నిదర్శనంగా మారాయి. 2021-22 విద్యా సంవత్సరంలో సెకండియర్లో 65శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, నాలుగేళ్లలో ఘోరంగా పడిపోయింది. ఇక కామారెడ్డి జిల్లా అయితే చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అధికారుల అలసత్వం, బోధనా వైఫల్యం మూలంగా కామారెడ్డి జిల్లా పరువు మంటగలిసింది. 8,740 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా, 4,378 మంది (50.09 శాతం) పాసయ్యారు. 7,722 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్ష రాయగా, 4,354 మంది (56.39శాతం) ఉత్తీర్ణులయ్యారు. కాలేజీల్లో బోధనా లోపాలను ఈ ఫలితాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి. ప్రైవేటు కళాశాలల్లోనూ ఫలితాలు అంతంతే వచ్చాయి. మొత్తంగా అధికారులు, అధ్యాపకులు, ఉపాధ్యాయుల నిర్లిప్తత మూలంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఫలితాలు తారుమారయ్యాయి.