సారంగాపూర్, మే 14: ఉమ్మడి రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువు నేడు నిండుగా నీటితో కళకళలాడుతున్నది. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ కారణంగా జీవం పోసుకొని అన్నదాతను కూడా బతికించింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ ఊర చెరువు ఏటా వరదనీటితో ఎగువ నుంచి కొట్టుకుని వచ్చిన మట్టి, ఇసుకతో నిండిపోయి మైదానంగా మారే దుస్థితికి చేరింది. చెరువులో నీరు నిల్వ సామర్థ్ధ్యం పూర్తిగా తగ్గిపోయి ఆయకట్టు భూములు బీడు ఉంచాల్సి వచ్చింది. తూము గేటు తుప్పు పట్టి.. ఉన్న కొద్దిపాటి నీరు కూడా వృథాగా బయటికి పోయేవి. దీంతో ఎండాకాలంలో చుక్కనీరు లేక మైదానాన్ని తలపించేది. చెరువు దుస్థితిని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు ఎన్నిసార్లు విన్నవించినా అప్పటి పాలకులు ఏనాడూ పంటించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక, అప్పటి సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా సాగునీటిపై దృష్టి పెట్టారు. చెరువుల పునరుద్ధరణకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. దీంతో పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయే స్థితిలో ఉన్న కేశాపూర్ చెరువు మళ్లీ జలకళ సంతరించుకున్నది. ఈ పథకం కింద మంజూరైన నిధులతో చెరువులో పూడికను తీశారు. కట్ట ఎత్తును పెంచి పునరుద్ధరించారు. ఫలితంగా నీరు నిల్వ సామర్థ్యం ఘననీయంగా పెరిగింది. తుప్పు పట్టి శిథిలావస్థకు చేరిన తూమును కొత్తగా నిర్మించారు. చివరి ఆయకట్టు పొలాలకు సైతం సాగునీరు అందేలా మట్టి కాలువకు సీసీ లైనింగ్ నిర్మించారు. దీంతో రైతులకు ఊపిరి వచ్చింది. భూములు మళ్లీ సస్యశ్యామలం అయ్యాయి. మిషన్ భగీరథ కారణంగా నేడు సాగునీటి రంది లేకుండా సంతోషంగా పుట్ల కొద్దీ వడ్లు పండిస్తున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయి ఎండలు దంచికొట్టినా కేశాపూర్ చెరువు నిండుగా నీటితో కళకళలాడుతుండడం గమనార్హం.
పూర్తిగా ఎండిపోయిన మా ఊరచెరువుకు కేసీఆర్ సర్కారు జీవం పోసింది. రైతులనూ బతికించింది. బీఆర్ఎస్ ప్రభుతం అమలు చేసిన మిషన్ కాకతీయ పథకంతో పూర్వ వైభవం వచ్చింది. ఆయకట్టు కింద ఉన్న 240 ఎకరాల్లో రెండు పంటలు పండించుకునే అవకాశం కలిగింది. గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది. చేప పిల్లల పెంపకంతో మత్స్యకార్మికుల కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నది. ప్రస్తుతం ఎండలు పెరిగినా మా ఊరి చెరువులో పుష్కలంగా నీళ్లున్నాయి.