ఖలీల్‌వాడి, ఆగస్టు 21: కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కుతున్నది. జీవో 97కు వ్యతిరేకంగా ఆందోళనలను మరిం త ఉధృతం చేస్తున్నది. పాలిటెక్నిక్ డిప్లమా కాలేజీలను, ఐటీఐలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లేదా శక్తి ఫ్రేమ్‌వర్క్ కింద విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు జీవో 97 జారీ చేసింది. అయితే, సాంకేతిక విద్యను ప్రైవేట్‌పరం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఉమ్మడి జిల్లాలో విద్యార్థులు పోరుబాట పట్టారు. నిజామాబాద్, నవీపేట, నందిపేట, కోటగిరి, మాక్లూర్ తదితర మండలాల్లో కొన్నిరోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శుక్రవారం కూడా ధర్నా నిర్వహించారు. విలీన ప్రక్రియపై సర్కారు వెనక్కు తగ్గాల్సిందేనని, లేకపోతే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
పాలిటెక్నిక్ కాలేజీలను, ఐటీఐలను విలీనం చేయాలని రేవంత్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. తమ భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని మండిపడుతున్నారు. డిప్లమో స్థాయి కలిగిన పాలిటెక్నిక్ కాలేజీలను సర్టిఫికెట్ స్థాయి కలిగిన ఐటీఐలను విలీనం చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో కనీసం చర్చించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఇలా విలీనం చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తుంటే సర్కారు ఎందుకు స్పందించడం లేదని విద్యార్థులు నిలదీస్తున్నారు. సాంకేతిక విద్యను ప్రైవేట్‌పరం చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. జీవో 97ను వెంటనే వెనక్కు తీసుకోవాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులతో పెట్టుకోవద్దని, ఇటీవల ఢిల్లీలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే భారీ ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఖలీల్‌వాడి, ఆగస్టు 21: జీవో -97ను రద్దు చేయాలని డిమాం డ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’లో పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేయవద్దని తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ చైర్మన్ రాజన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంగా, విద్యాశాఖమంత్రిగా ఉంటూ విధి విధానాలు రూపొందించకుండా ఏర్పాటు చేసిన ‘శక్తి’లో కళాశాలలన్నింటినీ విలీనం చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కన్వీనర్ నితిన్ పవార్, కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సునీత, సిబ్బంది పాల్గొన్నారు.