నిజామాబాద్, ఫిబ్రవరి 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై డబుల్ ఓట్ల దెబ్బ పడింది. గ్రామం, పట్టణాల్లో రెండేసి ఓట్లు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఎన్నికల యంత్రాంగం మొద్దు నిద్ర, నిర్లక్ష్యం వల్ల తప్పుల తడకగా ఓటరు జాబితా రూపుదిద్దుకుంది. అనేక రాజకీయ పార్టీలు ఈ విషయంలో అభ్యంతరాలు చెప్పినప్పటికీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోలేదు. తప్పుల జాబితాతోనే ఎన్నికలకు వెళ్లింది. తుది ఓటరు జాబితాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లో అనేక లోపాలు వెలుగు చూశాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందలోనూ ఇదే దుస్థితి ఏర్పడింది.
చనిపోయిన వారి పేరిట ఓట్లు కొనసాగించడం, పెళ్లి చేసుకుని మెట్టింటికి వెళ్లిన వారి పేరిట ఓట్లు ఉండటం వంటి చిత్ర విచిత్రాలకు ఓటరు జాబితా వేదికైంది. బీఎల్వోలకు ఓటరు సవరణ ప్రక్రియను అప్పగించినప్పటికీ జిల్లా ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోలేదు. క్షేత్ర స్థాయి లో ఇంటింటికి తిరిగి తప్పులను సరి చేయలేదు. ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పటికీ పోలింగ్ శాతం తగ్గుదలపై ఓటరు తుది జాబితాలోని తప్పులు తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో సామాన్యులపై కొరడా ఝులిపించే ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు ఈ విషయంలో మోనం వహిస్తున్నారు. ఈ తప్పులకు బాధ్యులను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చను తెచ్చి పెట్టినట్లు అయ్యింది.
డబుల్ ఓట్లతో పాటుగా కొంత మంది ఓటు వేయకపోవడం కూడా పోలింగ్ శాతం తగ్గడానికి కారణంగా నిలుస్తోంది. నిజామాబాద్ నగరంలో 3.48లక్షల మంది ఓటర్లుంటే కేవలం 2.05లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 59.12 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 1.43లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆర్మూర్, బోధన్, భీంగల్లో ఇంచుమించుగా 70శాతానికి పోలింగ్ శాతం చేరువైంది. వేలాది మంది ఓటు వేయకపోవడం విడ్డూరంగా మారింది. పట్టణాల్లో ఎక్కువ మంది అక్షరాస్యులున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వీరితో పోల్చుకుంటే గ్రామాల్లోనే ఓటరు చైతన్యం ఎక్కువగా ఉంది. ఓటరును చైతన్యవంతానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లుగా ఎన్నికల యంత్రాంగం చెప్పినప్పటికీ సత్ఫలితాలు ఇవ్వలేదు.
