చంబా: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం(Bus Accident) జరిగింది. బైరాఘర్-చంబా మార్గంలో ప్రైవేటు బస్సు రోడ్డుపై స్కిడ్ అయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడు మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. చంబా జిల్లాలోని చురా సబ్‌డివిజన్‌లో ఈ ప్రమాదం జరిగింది. చంబా నుంచి బైరాఘర్ వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు తెలిపారు. చాలుంజ్ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి.. కింద ఉన్న మరో రోడ్డుపై పడింది. రోడ్డుపై స్కిడ్ అయిన బస్సు.. దిగువ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు కిందమీదగా పడిపోయింది. అనేక మంది ప్రయాణికులు ఆ బస్సులో ట్రాప్ అయ్యారు. రెస్క్యూ బృందాలు, స్థానిక ప్రజలు ఆ స్పాట్‌కు చేరుకున్నారు.
బస్సులో చిక్కుకున్న వారిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతులను, గాయపడ్డవారిని గుర్తించాల్సి ఉన్నది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. చురాహ్ ఎమ్మెల్యే హన్స్ రాజ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ చాలా బాధాకరంగా ఉన్నట్లు చెప్పారు. మృతి చెందిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు.
చురాహ్లోని పర్వత ప్రాంతాలపై ఉన్న రోడ్లు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. అక్కడ మలుపులు, స్లోప్స్ వల్ల రోడ్డు ప్రమాణం ఇబ్బందిగా మారుతోంది. ఈ ఏడాది మే నెలలో కూడా ఇక్క డ ప్రమాదం జరిగింది. బెంగుళూరుకు చెందిన 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.