ముంబై: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్, ముంబైలోని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి శనివారం వెళ్లారు. ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీసు అందజేశారు. (Disha Salian’s Father) ఆ తర్వాత సతీష్ సాలియన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే తనను అపఖ్యాతిపాలు చేసినట్లు ఆయన ఆరోపించారు. అందుకే ఆదిత్య ఠాక్రేకు తాను రూ.500 కోట్ల పరువు నష్టానికి సంబంధించిన లీగల్ నోటీసు పంపినట్లు ఆయన చెప్పారు.
కాగా, ఆదిత్య ఠాక్రే తరుపు న్యాయవాది ఆ నోటీస్‌ను స్వీకరించినట్లు శివసేన (యూబీటీ) తెలిపింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఠాక్రే కుటుంబంపై బురదజల్లడానికి కొందరిని ‘తొత్తులుగా’ వాడుకుంటున్నారని, సతీష్ సాలియన్‌ను ఇతరులు నియంత్రిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత నారాయణ్ రాణే కుటుంబాన్ని, ఆయన కుమారుడు, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణేపై ఆయన మండిపడ్డారు. దిశా సాలియన్ మరణం కేసులో ఆదిత్య ఠాక్రే పేరును వారు లాగుతున్నారని విమర్శించారు.
మరోవైపు నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కొంతకాలం మేనేజర్‌గా పనిచేసిన 28 ఏళ్ల దిశా సాలియన్, 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఒక భవనం 12వ అంతస్తు నుంచి కింద పడి మరణించారు. ఆ తర్వాత వారం రోజులకు, జూన్ 14న సుశాంత్ సింగ్ తన బాంద్రా అపార్ట్మెంట్లో అనుమానాస్పందగా చనిపోయారు. దీంతో ఈ రెండు మరణాల మధ్య ఏదైనా సంబంధం ఉందేమోనన్న ఊహాగానాలు తలెత్తాయి.
అయితే తాజాగా బాంబే హైకోర్టు ఆదేశాలతో దిశా సాలియన్ మరణంపై సీబీఐ ఒక కేసు నమోదు చేసింది. ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురి పేర్లను ఎఫ్ఐఆర్లో ప్రస్తావించింది. అయితే దిశా సాలియన్ మరణం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఆమెను ఎప్పుడూ కలవలేదని, ఆమె ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. అలాగే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ‘పరువు తీసే’ ప్రచారం ఆగకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే గురువారం హెచ్చరించారు.