West Asia : యెమెన్ (Yemen) కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు (Hauti Rebels) సౌదీ అరేబియా (Saudi Arabia) పై క్షిపణి, డ్రోన్ దాడులు (Drone attacks) చేస్తున్న నేపథ్యంలో అమెరికా (USA) అప్రమత్తమైంది. పశ్చిమాసియా (West Asia) లో భద్రతా పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చవచ్చని హెచ్చరిస్తూ తన పౌరులకు కొత్త ట్రావెల్ అడ్వైజరీ (Travel Advisary) ని జారీచేసింది. ఈ ప్రాంతంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణాలు పెట్టుకోవాలనుకునే వారు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని స్పష్టంచేసింది.
అమెరికా విదేశాంగ శాఖ ఈ హెచ్చరికను విడుదల చేసింది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉన్న అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, విమానాలు రద్దు కావడం, గగనతలాలు మూసివేయడం వంటి ప్రయాణ అంతరాయాలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. పశ్చిమాసియాకి లేదా ఆ మార్గం గుండా ప్రయాణించాలనుకునే వారు తమ ప్రణాళికలను తీవ్రంగా పునఃపరిశీలించుకోవాలని, విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరింది.
ఇరాన్ మద్దతున్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని పౌర విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఈ అడ్వైజరీలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ ఘర్షణ “వేగంగా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది” అని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఇరాన్, దాని మద్దతు ఉన్న గ్రూపులు విదేశాల్లోని అమెరికా ప్రయోజనాలు, వ్యాపారాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకోవచ్చని కూడా హెచ్చరించింది.
సౌదీ రాజధాని రియాద్‌తోపాటు యాన్బు వంటి ఇతర సున్నిత ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ హెచ్చరిక వెలువడింది. రాజధాని వైపు దూసుకొస్తున్న ఒక క్షిపణిని అడ్డుకున్నామని సౌదీ ఎయిర్ డిఫెన్స్ దళాలు తెలిపాయి. రియాద్ విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు, పొగ కనిపించినట్లు వార్తలు వచ్చినా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని సౌదీ అధికారులు ప్రకటించారు.
ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల ముప్పు, సాయుధ ఘర్షణలు, ఉగ్రవాదం వంటి కారణాలతో సౌదీ అరేబియాపై ఇప్పటికే లెవెల్ 3 అడ్వైజరీ కొనసాగుతోంది. ఇక యెమెన్‌పై లెవెల్ 4 హెచ్చరిక అమల్లో ఉంది. యెమెన్ సరిహద్దుకు సమీపంలో పనిచేసే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులపై అదనపు ఆంక్షలు కూడా విధించారు.