Nizamabad | శక్కర్ నగర్ : మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోధన్ ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు. బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, పట్టణ పోలీసులు బుధవారం వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాలు నడిపిస్తున్న పలువురు మైనర్లను గుర్తించారు.
వీరిని బోధన్ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లి వారి తల్లిదండ్రులను, వాహనాల యజమానులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్ల ఫై కేసులు నమోదు చేయడంతో పాటు, వాహనాలు సీజ్ చేస్తామని, యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని సూచించారు. నిత్యం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వాహనాల తనిఖీకి ప్రజలు సహకరించాలని, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వరాదని ట్రాఫిక్, పట్టణ సీఐలు చందర్ రాథోడ్, వెంకటనారాయణలు సూచించారు.