ఖాకీలు కట్టు తప్పారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు ఎస్సైలు, సీఐలు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మరోవైపు, రెండు జిల్లాల్లో ఇసుక, మొరం వంటి సహజ సంపద విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నది. పోలీసుల సహకారంతో అక్రమ దందా దర్జాగా నడుస్తుందన్నది. పట్టపగలే చోరీలు, పెరుగుతున్న నేరాలు పోలీసు శాఖకు చెడ్డుపేరు తెచ్చి పెడుతున్నాయి.
ఈ క్రమంలోనే నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పి.సాయిచైతన్య, కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర నియమితులు కావడం, సోమవారం వారు బాధ్యతలు స్వీకరించడంతో అక్రమాలకు కళ్లెం పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. అయితే, ఉమ్మడి జిల్లాలో పాతుకుపోయిన ఇసుక, మొరం మాఫియా ఆగడాలను అడ్డుకోవడం, గుట్కా, గంజాయితో పాటు అల్ఫ్రాజోలం నిషేధిత మత్తు పదార్థాల సరఫరాను నియంత్రించడం పోలీస్ బాస్‌లకు సవాల్‌గా మారనున్నది.
-నిజామాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి జిల్లాలో కొందరు పోలీసులు బరి తెగించారు. అక్రమార్కుల ఆట కట్టాల్సిన వారే వారితో చేతులు కలిపి అవినీతికి తెర లేపారు. ఇసుక, మొరంతో పాటు ఇతర అక్రమ దందాల ద్వారా భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ఏసీబీకి చిక్కారు. కోటగిరి ఎస్సై రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయాడు. లింగంపేట ఠాణాలో రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎస్సైలు లంచం తీసుకుంటూ పట్టుబడడం.. ఉమ్మడి జిల్లాలో పోలీసు పనితీరుకు అద్దం పట్టింది. న్యాయం కోసం వచ్చే వారి నుంచి కొందరు ఎస్సైలు, సీఐలు భారీగా వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది.
అసాంఘిక శక్తులతో కొమ్ము కాస్తూ దందాలు నిర్వహించడం కూడా ఈ మధ్య కాలంలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో నిజామాబాద్‌లో వెలుగు చూసింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా పని చేస్తూ ఒక అధికారి భారీగా వసూళ్లకు ఎగబడటాన్ని ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో బట్టబయలు చేయగా డీజీపీ స్పందించి సదరు అధికారిపై వేటు వేశారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిఘా వర్గాల సమాచారం మేరకు ఇసుక దందాకు సహకరిస్తున్న పది మంది ఎస్సైలు, ఇద్దరు సీఐలపై చర్యలు తీసుకోవాలని స్వయంగా డీజీపీ ఆదేశాలు జారీ చేయడం పోలీసుల అవినీతి పర్వానికి సాక్ష్యంగా నిలిచింది.
మరికొందరు పోలీసులు క్రమశిక్షణ తప్పారు. ఇందల్వాయి ఠాణాలో ఓ మహిళతో అక్రమ వ్యవహారాలను నడిపి ఎస్సై వివాదాస్పదమయ్యారు. ఇక, కామారెడ్డి శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో వ్యక్తి చనిపోయిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రెంజల్ పోలీస్ స్టేషన్లో ఓ గిరిజన వృద్ధుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. తరుచూ చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు వెలుగు చూస్తుండగా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సంకట పరిస్థితికి తోడుగా మితిమీరిన రాజకీయ ప్రమేయం మూలంగా నిజామాబాద్ సీపీ, కామారెడ్డి ఎస్పీలు సవాళ్లను ఎదుర్కోవడం కత్తి మీది సాములా మారనున్నది.
మంజీరా పరీవాహక ప్రాంతమైన బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఇసుక, మొరం దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. టీజీఎండీసీ నుంచి అనుమతి లేకపోయినప్పటికీ స్థానిక పోలీసులు, రెవె న్యూ, మైనింగ్ అధికారుల సహకారాలతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వేస్తున్నారు. బిచ్కుంద, బీర్కూర్ మండలాల్లో మంజీరా నదికి ఇరు వైపులా సాగుతున్న ఇసుక దందాలో పోలీసులే ప్రత్యక్ష పాత్రధారులుగా నిలుస్తున్నారని ఆరోపణలున్నాయి.
స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతోనే ఇదంతా జరుగుతున్నదని ప్రచారం జరుగుతున్నది. వే బిల్లులు లేకుండానే ట్రాక్టర్లలో భారీగా ఇసుక తరలి వెళ్తున్నది. రాత్రి వేళ టిప్పర్లు, లారీల్లో మంజీరా ఇసుకను కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు. మంజీరా పరీవాహకంలో ఇసుక మాఫియా బలంగా వేళ్లూనుకున్నది. అడ్డం వచ్చిన వారిని బెదిరింపులకు పాల్పడటంతో పాటు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలున్నాయి. కొత్తగా వచ్చిన కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర ఈ వ్యవహారాలపై దృష్టి సారించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
ఇసుక అక్రమాలను సహించేది లేదన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ మేరకు కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. కానీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇసుక అక్రమాలకు మాత్రం ఎక్కడా కళ్లెం పడలేదు. సీఎం ఆదేశించినప్పటికీ, రాత్రి, పగలు తేడా లేకుండా చాలాచోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇందులో సూత్రధారులకు పోలీసులే అండగా నిలుస్తున్నారని ఆరోపణలున్నాయి. బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల్లో అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొడుతున్నారు.
మొన్నటి వరకూ జీరో దందా నడపగా, ఇప్పుడు ఏకంగా వే బిల్లుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ల నుంచి దొంగ వే బిల్లులు, వాడి పాడేసిన పాత బిల్లులతో విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, వేల్పూర్, భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ల ముందు నుంచే ఇసుక అక్రమ తరలింపు జరుగుతున్నా అడ్డుకునే వారే లేరు. ఐదున్నర నెలలుగా జిల్లాకు పూర్తి స్థాయి సీపీ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది కొందరు అడ్డే లేకుండా వ్యవహరించారు. అయితే, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో ఇసుక అక్రమార్కుల భరతం పట్టేందుకు పోలీసులు నడుం బిగిస్తారని జనం ఆశిస్తున్నారు.