వినాయక్ నగర్,మే : 27 మహారాష్ట్రలోని సతారా జిల్లా పరిధిలో ఉన్న ఓ ఫార్మా కంపెనీలో అక్రమంగా మత్తు పదార్థం (అల్ఫ్రాజోలం) తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు. మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. నార్కోటిక్ డ్రగ్ బృందం ఇంటర్ షిప్ ద్వారా మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న సూర్యప్రభ ఫార్మా ఇండస్ట్రీలో మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్లుగా బోధన్ రూరల్ సీఐ విజయబాబు ఆధ్వర్యంలో గుర్తించినట్లు తెలిపారు.
ఇండస్ట్రీ నడుపుతున్న అమరేందర్ సింగ్ దేశ్ముఖ్, ప్రసాద్ కడేరి, బయో సిమ్యులెంట్ కంపెనీ యజమాని బాబురావు, అల్ఫ్రా సోలం కొనుగోలు చేసిన లక్ష్మణ్ గౌడ్, రాశి ట్రేడర్స్ ఫార్మా కంపెనీ నిర్వాకుడు విశ్వనాధ్ను పది రోజుల క్రితం అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకొని లోతుగా విచారణ చేపట్టగా వీరు తయారుచేసిన అల్ఫ్రాజోలంను కళ్లు డిపోలకు అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.
మహారాష్ట్ర నుండి సోలాపూర్ వెళ్లే జాతీయ రహదారి పక్కన నిందితుడు బాబురావుకు సంబంధించిన గోదాములో రూ.3 కోట్ల రూపాయల విలువచేసే 30 కిలోల అల్ఫ్రజోలంను సీజ్ చేసినట్లు తెలిపారు. అమరేందర్ సింగ్ దేశ్ముఖ్ అనే నిందితుడు ఇంట్లో నుండి 12 లక్షల నగదు తోపాటు కారును సీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు.