నిజామాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చరిత్ర తిరగరాశారు. స్పీకర్‌గా పని చేసిన వారెవ్వరు తదుపరి ఎన్నికల్లో గెలవబోరనే సెంటిమెంట్‌ను బద్దలుకొట్టారు. శాసన సభాపతిగా ఉంటూ పోచారం శ్రీనివాసరెడ్డి తాజా ఎన్నికల ఫలితాల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేశారు. గతంలో ఎన్నడూ ఎవ్వరితోనూ కాని విజయాన్ని ఆయన కైవసం చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు గతంలో పనిచేసిన ఏ ఒక్క అసెంబ్లీ స్పీకర్ కూడా తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. సభాపతులకు పదవీగండం తప్పదనే సెంటిమెంట్‌ను తుడిచేస్తూ పోచారం బాన్సువాడలో ఘన విజయంతో కొత్త రికార్డు సృష్టించారు. మొత్తం తన రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు పోటీ చేసిన పోచారం. ఏకంగా ఏడుసార్లు గెలుపొందారు. 2004లో ఒక్కసారి మాత్రమే ఓటమి చెందారు. మూడు పర్యాయాలు మంత్రిగా, ఒకసారి శాసన సభాపతిగా పని చేసిన రికార్డు ఆయన సొంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్లో తొలి వ్యవసాయ శాఖ మంత్రిగానూ పోచారం శ్రీనివాసరెడ్డి ఘనతను దక్కించుకున్నారు. 2018లో రెండోసారి ఏర్పాటైన ప్రభుత్వంలో స్పీకర్‌గా విధులు నిర్వర్తించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సేవకే అంకితమైన పోచారం శ్రీనివాసరెడ్డి జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజా నాయకుడిగా చిరస్థాయి గుర్తింపును సాధించుకున్నారు. ఎన్ని రాజకీయ పదవులు అనుభవించినప్పటికీ పోచారం మాత్రం ఎప్పుడూ తన నియోజకవర్గ ప్రజలను వదిలి వెళ్లలేదు. వారంలో సగానికి ఎక్కువ రోజులు నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండడం ఆయనకే చెల్లింది. వ్యవసాయ మంత్రిగా, స్పీకర్‌గా రాష్ట్రంలో కీలక పదవుల్లో ఉన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. వ్యవసాయ మంత్రిగా చిరస్థాయి గుర్తింపును పొందారు. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాల రూపకల్పనలో సీఎం కేసీఆర్‌తో పాటు మేథోమధన చర్చల్లోనూ పాల్గొన్నారు. ఏకంగా లక్ష్మీపుత్రుడిగా కేసీఆర్ ద్వారా పిలిపించుకున్నారు. కేసీఆర్ సహకారంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాన్సువాడ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు. ఏకంగా 10వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు. చిన్నపాటి గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చి బాన్సువాడ పట్టణాన్ని అభివృద్ధికి కేరాఫ్‌గా మార్చారు. అంతేకాకుండా నియోజకవర్గంలో 11వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. ఇందులో 10వేల ఇండ్లను పేదలకు పంపిణీ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను నిర్మించి గిరిజనుల కోసం సాగు నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేశారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయడం పోచారం శ్రీనివాసరెడ్డికి అలవాటు. ప్రజలతో కలిసి మెలిసి ఉండడం, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడం ద్వారా పోచారం అద్భుత విజయాన్ని కైవసం చేసుకుని రికార్డును తిరగరాశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్‌గా ఉంటూ తప్పక గెలుస్తానంటూ పోచారం శ్రీనివాసరెడ్డి గతంలోనే అనేక సార్లు సవాల్ విసిరారు. స్పీకర్ పదవిని చేపట్టే వారంతా తర్వాతి కాలంలో రాజకీయంగా కనుమరుగు అవుతారనే సెంటిమెంట్ ఉండడంతో చాలా మంది దీన్ని నమ్మారు. కానీ 45 ఏండ్ల రాజకీయ జీవిత అనుభవమున్న పోచారం మాత్రం సెంటిమెంట్‌ను బద్దలు కొట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా వ్యవహరించిన వారంతా ఓడిపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన కేఆర్ సురేశ్‌రెడ్డి సైతం గతంలో స్పీకర్‌గా పని చేశారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్‌గా పనిచేసిన ఆయన.. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పోచారం మాత్రం రికార్డును బ్రేక్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులంతా ఇదే సెంటిమెంట్‌ను నమ్ముకుని పోచారం శ్రీనివాసరెడ్డిపై విజయం సాధిస్తామంటూ సవాల్ విసిరారు. కానీ అలాంటి పప్పులేవి ఉడకలేదు.