వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి మొదలైన పండుగలు జాతి మొత్తం అధిక సంఖ్యలో చేసుకునేవే. కానీ, ఈ పండుగల వెనుక హిందూధర్మ విశ్వాసాలు, భగవత్ సంబంధ భావనలు, వేడుకలున్నాయి. కానీ, హోలి మాత్రం కుల మతాలకు అతీతమైన రంగుల పండుగ. ఈ రంగులు ఎవరైనా చల్లుకోవచ్చు. రంగులు పులుముకొని ఎవరినైనా అలరించవచ్చు. అన్ని వర్ణాలు కలిస్తే తెలుపు ఏర్పడుతుంది. విడివిడిగా ఏ రంగు ప్రత్యేకత దానిదే. కలిస్తే వివర్ణమైపోతాయి. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ తత్త్వమనే అంశాన్ని ఇది సూచిస్తుంది. భిన్న భాషలు, భిన్న సంస్కృతులతో విలసిల్లి.. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అందరినీ ఆనంద డోలికలు ఊగించే హోలి జాతీయ సమైక్యతకు ప్రతీక.
హోలి పండుగ ముందురోజు రాత్రి కాముడిని (మన్మథుడిని) దహనం చేయడం ఆనవాయితీ. దీని వెనుక ఒక ఐతిహ్యం ప్రచారంలో ఉంది. తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి ఆటంకం కలిగించి, కోరికలు రేకెత్తించడానికి మన్మథుడు ప్రయత్నిస్తాడు. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు తన మూడోకన్ను తెరిచి కాముడిని భస్మీపటలం చేస్తాడు. ఈ సందర్భంగా హోలి ముందురోజు కాముని దహనం చేస్తారు. పరమేశ్వరుడు కాముడిని భస్మం చేసి సమస్త జాతికి ఒక సందేశాన్నిచ్చాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగి ఉండే రాగ, ద్వేష, కామ, క్రోధ, మోహ, మాయా గుణాలను నాశనం చేసుకుని మనసును తమ అదుపులో ఉంచుకోవాలని ఇది సూచిస్తుంది.
పరమేశ్వరుడు భస్మం చేయడంతో శరీరాన్ని కోల్పోయిన కాముడు అదృశ్యరూపంలో అంతటా వ్యాపించి ఉన్నాడు. కామం అంటే కోరిక. ప్రతి మనిషిలో సాధారణంగా ఎన్నో కోరికలు దాగి ఉంటాయి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా మనసు చెడువైపు తొందరగా ఆకర్షితమవుతుంది. కోరికలు ప్రజ్వరిల్లి గుర్రాల్లా స్వారీ చేస్తే ఎంతటివాడైనా భ్రష్టుడైపోతాడు. మనలోని రజో, తామస గుణాలను పారదోలి, సాత్త్విక గుణంతో జీవిస్తేనే మనిషి జన్మకు సార్థకత. మనిషిలో ఉండే కోరికలను దహింపజేసి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేది ఈ పండుగ అంతరార్థం.
కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విధ్యేనమిహ వైరిణమ్.
(భగవద్గీత 3-37)
కామక్రోధలోభాదులలో కామమే బలీయమైనది. ఆస్తి, ఐశ్వర్యాదులతోపాటు స్త్రీ, పురుషుల పరస్పర అనైతిక వాంఛ కూడా కామమే. ఈ కామం నుంచే క్రోధాదులు ఉత్పన్నమై మనిషి పతనానికి హేతువులవుతాయనీ, కామమే శత్రువు అని భగవద్గీత చెబుతుంది. అలాంటి కామాన్ని నామరూపాలు లేకుండా దహించాలని పరమశివుడు తనను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన మన్మథుడిని మూడో కన్నుతో భస్మం చేశాడు. కోరికలనే మన్మథులను ఆత్మజ్ఞానంతో దహించడమే ఈ పండుగ ప్రత్యేకత.