శ్రీ చైతన్య మహాప్రభువు 1486లో నవద్వీపంలో అవతరించారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మే భక్తభావంలో స్వయంగా అవతరించిన దివ్య భక్త అవతార రూపం. శాస్త్ర సూచన ప్రకారం “కృష్ణవర్ణం త్విషా కృష్ణం”. అలాగే గరుడ పురాణం, నారద పురాణం, విష్ణు సహస్రనామం వంటి శ్లోకాల ఆధారంగా ఆయన కలియుగ అవతార లక్షణం స్పష్టమవుతుంది. మహాప్రభువు మనసులో నిద్రించే కృష్ణభక్తిని మేల్కొలపడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన బోధించిన శిక్షాష్టకం ఉపదేశాలు, అచింత్య భేదాభేద తత్వం, హరినామ సంకీర్తన, వినయం, నిరహంకార సేవ, విరహభక్తి లాంటి గుణాలు, భక్తి జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ శాస్ర్తానుసారం భక్తి సాధనానికి ఆదర్శ మార్గాన్ని అందిస్తాయి.
శ్రీ చైతన్య మహాప్రభువు అవతార లక్ష్యం ఏమిటి? ఆయన ఎందుకు భక్తరూపంలో అవతరించారని గౌడీయ ఆచార్యులు వివరిస్తారు? కలియుగవాసుల కష్టాలను తీర్చి, వారికి అత్యంత సులువైన ‘హరినామ సంకీర్తన’ అనే యుగధర్మాన్ని ప్రసాదించడమే శ్రీ చైతన్య మహాప్రభువు అవతార ముఖ్య లక్ష్యం. సాధారణంగా శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడం కష్టమని, కానీ మహాప్రభువు చూపిన మార్గం ద్వారా కృష్ణ ప్రేమను పొందడం సులభమని ఆచార్యులు వివరిస్తారు. లోకానికి భక్తి మార్గాన్ని స్వయంగా ఆచరించి బోధించడం కోసం ఆ దేవాదిదేవుడే ఒక భక్తుని రూపంలో (గుప్తావతారం) అవతరించారు.
‘కృష్ణవర్ణం త్విషాకృష్ణం’ అనే శాస్త్రవాక్యం ఏ గ్రంథంలో ఉంది? అది మహాప్రభువుకు ఎలా అన్వయం అవుతుంది? శ్రీమద్భాగవతం (11.5.32)లో ఉన్న ఈ శ్లోకం మహాప్రభు అవతారాన్ని గురించి వివరిస్తుంది. ఇందులో ‘అకృష్ణ’ అంటే నలుపు రంగు కానివాడు (బంగారు వర్ణం కలిగినవాడు) అని అర్థం.
కృష్ణ-వర్ణం త్విషాకృష్ణం సంగోపంగాస్త్రపార్షదమ్
యైజ్ఞెః సంకీర్తనప్రాయైర్ యజంతి హి సుమేధసః॥
ఈ కలియుగంలో ఆవిర్భవించి, సదా కృష్ణనామ గానం చేసే భగవత్ అవతార మూర్తిని మేధోసంపత్తి కలిగిన మనుషులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు. తన వర్ణం నలుపు కానప్పటికీ, అతను సాక్షాత్తు శ్రీకృష్ణుడే! వారు సంకీర్తనోద్యమాన్ని స్థాపించడానికి తమ అనుచరులతో కలిసి ఈ భువిపై అవతరిస్తారు.
ఇలా.. శ్రీచైతన్య మహాప్రభువుగా శ్రీకృష్ణుడు అవతరించడం భగవంతుడి యుగావతారం కోవకు చెందినదని గ్రహించగలం. శిక్షాష్టకం ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు సమాజానికి, భక్తులకు, శిష్యులకు ఇచ్చిన ముఖ్యమైన సందేశం ఏమిటి? మహాప్రభువు తన బోధనల ద్వారా ప్రతి జీవుడు శ్రీకృష్ణుడి నిత్య దాసుడు అనే పరమ సత్యాన్ని చాటారు. ‘జన్మ సార్థక కరి కరో పరోపకార్’ అంటే హరినామ సంకీర్తనతో మీ జీవితాన్ని సార్థకం చేసుకుని, ఇతరులకు కూడా ఆ అవకాశాన్ని కల్పించి ఉపకారం చేయమని ఆయన సందేశం ఇచ్చారు. కుల, మత, వర్ణ భేదాలను తిరస్కరించి, భగవన్నామాన్ని జపించే హక్కు అందరికీ ఉందని ఆయన నిరూపించారు. మహాప్రభువు జీవితం ‘భగవద్గీతలోని సర్వధర్మాన్ పరిత్యజ్య’ ఉపదేశాన్ని అనుసరించడం ద్వారా ఆయన చూపిన భక్తి జీవన విధానాన్ని మనం మన జీవితంలో ఎలా అమలు చేసుకోవాలి?
భగవద్గీతలోని ‘సర్వధర్మాన్ పరిత్యజ్య…’ అనే శరణాగతి ఉపదేశాన్ని మహాప్రభువు తన జీవితం ద్వారా పరిపూర్ణంగా చూపారు. మన నిత్య జీవితంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనసును పవిత్రం చేసుకోవచ్చని బోధించారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అలాగే మాంసాహారం, జూదం, మద్యం, వ్యభిచారం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ భక్తిలో నిమగ్నం కావడమే ఆయన చూపిన మార్గం.