నాగిరెడ్డిపేట్ : జూలై 19 : వానాకాలం ప్రారంభమైన నెలన్నర దాటినా చినుకు జాడ కరువైంది. దీంతో సాగునీటి వనరులన్నీ బోసిపోతున్నాయి. మండంలోని పోచారం ప్రాజెక్టులో నీటి నిల్వలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించగా,నేడు డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. వానకాలం పంటల సాగుపై ఆశలు పెంచుకున్న అన్నదాతలకు వర్షాభావ పరిస్థితులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వరుణుడు కరుణిస్తాడనే నమ్మకంతో నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. కొన్నిచోట్ల జోరుగా నాట్లు సాగుతున్నాయి. వర్షాలు కురవకపోవడంతో కాలం అయిపోతుందా, పోచారం ప్రాజెక్టు ఆదుకుంటుందా.. లేదా వలస వెళ్దామా అని దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.
పోచారం ప్రాజెక్టు నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలకు తాగు, సాగునీరు అందిస్తుంది. రెండు మండలాల్లోని 18వేల ఎకరాలకు సాగునీరు అందించగా, 13 కాలువల ద్వారా పంటలకు నీరందుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు (1464 ఎంసీఎఫ్టీ)కాగా, ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకున్నది.
వర్షాలు కురిసి పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే చుట్టూ ప్రక్కల గ్రామాలకు బోరుబావులు సమృద్ధిగా నీటిని అందిస్తాయి. వర్షాల జాడ లేకపోవడం, ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో బోరుబావులన్నీ వట్టిపోతున్నాయి. బోరు బావులపై ఆధారపడి నాట్లు వేస్తున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచించడంతో వరి వేయడానికి నారు సిద్ధం చేసుకున్న రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే పొలాలన్ని దుక్కిదున్ని, మందు సంచులు కొనుగోలుచేసి నారు మడులు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు కురవకపోతే తాము పడిన శ్రమ, సాగుకోసం చేసిన ఖర్చులు వృథా కానున్నాయని ఆందోళన చెందుతున్నారు. సాగు పనుల్లో నిమగ్నమైన కొందరు రైతులు వరుణుడిపై భారం వేశారు.