నిజామాబాద్, జనవరి 24: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో శాపంగా మారనుందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు విమర్శించారు. ఈ వ్యవహారంలో లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తున్నదని అన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులకు ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అనే ఒక కల్పిత కథలో కథానాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అధినాయకుడు, సీఎం రేవంత్ రెడ్డే అని తెలిపారు.
సిట్ ఇస్తున్న నోటీసులు చూసి తెలంగాణ ప్రజలు నొసలు వెక్కిరిస్తున్నారని మధుసూదన్ రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం నుంచి ఉద్భవించిన కేటీఆర్, హరీశ్‌రావు అనే ఉద్యమ శక్తులను ట్యాపింగ్ అనే తప్పుడు కేసుల్లో ఇరికించి ఏదో సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కలల్ని కల్లలకు కాక తప్పదన్నారు. అభూత కల్పిత కథలతో అల్లిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారబోతుందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయం బీఆర్ఎస్ నాయకుల వైపే ఉందని స్పష్టం చేశారు.