హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పెద్దల తీరుపై కలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారా? కలెక్టర్ల సమావేశం సందర్భంగా తమను టార్గెట్ చేశారని భావిస్తున్నా రా? ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని తమపై రుద్దుతున్నారనే అభిప్రాయంతో ఉన్నారా? తమను విఫల కలెక్టర్లుగా ముద్రవేసే ప్రయ త్నం చేస్తున్నారని భావిస్తున్నారా? పదే పదే బదిలీలతో తమ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నారనే అసంతృప్తి వెంటాడుతున్నదా? ఈ ప్రశ్నలకు ఐఏఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్న కలెక్టర్లు.. తాజాగా మంగళవారం నిర్వహించిన సమావేశంతో మరింత అసంతృప్తికి లోనయ్యారనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని తమపై రద్దుతూ, తమను బాధ్యులుగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అసంతృప్తిని వారు వ్యక్తం చేసినట్టు తెలిసింది. పరిపాలనకు సంబంధించి పదే పదే తమ ను నిందిస్తున్నారని, తాము పని చేయకుండానే పాలన సాగుతున్నదా? ప్రభుత్వం నడుస్తున్నదా? అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వ పెద్దలు తమ వైఫల్యాలను ఎత్తుచూపేందుకే ప్రయత్నించారని, కానీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలు, ప్రభుత్వంలోని కీలక నేతలు చేస్తున్న ఆగడాలు, అరాచకాలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
పలువురు కలెక్టర్ల పనితీరు సరిగాలేదంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ‘మేము పని చేయకుండానే పాలన, ప్రభుత్వం కొనసాగుతున్నదా? ఒకవైపు ఇష్టారీతిన బదిలీలు చేస్తుం టే పాలన ఎలా సాధ్యం?’ అని ప్రశ్నిస్తున్నా రు. ఐఏఎస్‌లను పదే పదే బదిలీ చేయడంపై సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కుర్చీలో కూర్చొ ని సర్దుకోకముందే.. మళ్లీ బదిలీ ఆర్డర్ వస్తున్నద ని, ఇక పాలన ఎక్కడ చేయాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కనీసం పది సార్లు కలెక్టర్ల బదిలీలు జరిగాయి. సగటున మూడు నెలలకోసారి కలెక్టర్లను మార్చడం గమనార్హం. పదే పదే బదిలీలు చేస్తూ తమ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బ తీస్తున్నారనే అభిప్రాయాన్ని ఐఏఎస్‌లు వ్యక్తం చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. కలెక్టర్ల పనితీరుపై ప్రభుత్వం సేకరించిన నివేదికలను మీడియాకు లీకులివ్వడంపై కూడా ఐఏఎస్‌లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
99 రోజుల ప్రణాళికలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయాలని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అయితే ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉన్నాయని, కానీ ఆచరణలో మాత్రం ప్రణాళికా లోపం స్పష్టంగా కనిపిస్తున్నదనే అభిప్రాయం కలెక్టర్లు వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల గండం పొంచి ఉన్నదని చెప్పినట్టు తెలిసింది.
ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ జరిగినట్టు తెలిస్తే వెంటనే సదరు కలెక్టర్లు, ఎస్పీలను సస్పెండ్ చేస్తామంటూ సమావేశంలో ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇచ్చా రు. దీనిపై ఐఏఎస్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అవినీతి, అరాచకాలు చేస్తున్నదెవరో, జిల్లాల్లో ఎవరెవరు కీలక భాగస్వాములో ప్రభుత్వ పెద్దలకు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. వాళ్లు అవినీతి చేస్తుంటే.. శిక్షలు మాత్రం మాకా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఒకవేళ తాము ఇసుక మాఫియా, మైనింగ్‌పై చర్యలు తీసుకుంటే.. వెంటనే పై నుంచి ఒత్తిడి చేస్తున్నారని, ఒత్తిళ్లకు తలొగ్గకపోతే బదిలీని బహుమానంగా ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఆ మాఫియా వెనుక కీలక నేతలున్నారనే ఆరోపణలున్నాయి.