రంగారెడ్డి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) ; హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యాపారులు కొండలను కొల్లగొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కొండల నుంచి మట్టి, గ్రానైట్, కంకర వ్యాపారం యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే జిల్లాలో అక్రమ క్రషర్ మిషన్లు నడుస్తున్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మైనింగ్ వ్యాపారం జిల్లాలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమ మైనింగ్ వ్యాపారులకు కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలుండటంతో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో సర్కారు ఆదాయానికి భారీగా గండి పడుతున్నది.
జిల్లాలోని ఔటర్ రింగ్‌రోడ్డుకు అతి సమీపంలో ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానస హిల్స్‌లో పొంగులేటికి చెందిన రాఘ వ కన్స్రెక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండానే గత కొంతకాలంగా అక్రమంగా మై నింగ్ వ్యాపారం చేస్తున్నది. అయినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఫిర్యాదుతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా క్వారీ నుంచి రాఘవ కన్స్ట్రెక్షన్ పెద్దఎత్తున కంకర, గ్రానైట్ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నది. అటువైపు వెళ్లడానికి అధికారులు భయపడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. జిల్లా పరిధిలోని హైదరాబాద్ సమీపంలో ఉన్న హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, రాజేంద్రనగర్, బాలాపూర్, గండిపేట్, శేరిలింగంపల్లి వంటి మండలాల్లో పెద్దఎత్తున సర్కారుకు సంబంధించిన గుట్టల్లో అక్రమంగా క్వారీలను ఏర్పాటు చేసి వ్యాపారాలు సాగిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారు.
గుట్టలు స్వాహా..
జిల్లాలోని ప్రకృతి సంపదకు నిలయమైన అనేక గుట్టలను అక్రమ మైనింగ్ వ్యాపారులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. బాలాపూర్ సర్వే నం.78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87లలో గల దేవతల గుట్టను కొంతమంది మైనింగ్ వ్యాపారులు గత కొంతకాలంగా కంకర, గ్రానైట్ వ్యాపారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్నారు. జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నం.177లోగల మరో గుట్టను కూడా అక్రమ వ్యాపారులు మట్టి, గ్రానైట్ తరలిస్తున్నారు. ఈ గుట్ట ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఇక నుంచి మట్టి, గ్రానైట్, కంకర తీస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని, కేసులు కూడా నమోదవుతాయని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఖాతరు చేయకుండా కొల్లగొడుతున్నారు. బాలాపూర్‌లో గల దేవతల గుట్ట సర్కారు ఆధీనంలో ఉందని.. ఈ గుట్టపై వ్యా పారాలు పూర్తిగా నిషేధించబడ్డాయని హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ కొంతమంది రి యల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ గుట్ట నుంచి మ ట్టిని ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడమే కాకుండా భూమిని చదును చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, కొత్తూరులలో ప్రభు త్వ ఆధీనంలో ఉన్న గుట్టల్లో కూడా కంకర, మట్టిని కొల్లగొడుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. మాడ్గుల మండలంలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గుట్టల నుంచి మట్టి, కంకర, గ్రానైట్లను అక్రమంగా నగరానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి.
అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ వ్యాపారం
జిల్లాలో సుమారు 200లకు పైగా మైనింగ్ క్వారీలున్నాయి. కాని, కేవలం 67 క్వారీలకు మాత్రమే అనుమతులుండగా.. అందులో 37 మాత్రమే నడుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. కాని, అనధికారికంగా వందలాది క్వారీలు నడుస్తున్నాయి. అలాగే, జిల్లాలో అధికారికంగా 55 పలుగురాయి క్వారీలున్నాయి. అనధికారికంగా మరో 50 వరకు పలుగురాయి క్వారీలున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు మట్టి తరలింపునకు ఏ ఒక్క అనుమతి లేదని అధికారులు చెప్తున్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండానే రాత్రి సమయంలో వందలాది ట్రిప్పుల మట్టిని నగరంతో పాటు నగర శివారుల్లోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మట్టి అక్రమ తరలింపుపై మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలొస్తున్నాయి.
కాసులు కురిపిస్తున్న మట్టి అక్రమ వ్యాపారం
జిల్లాలో అక్రమ మట్టి వ్యాపారం పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. అక్రమ మట్టి వ్యాపారులు రాత్రి సమయంలో వేలాది టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తుండటం పెట్రోలింగ్ పోలీసులకు వరంగా మారింది. పోలీసులు మట్టి తరలింపు వాహనాలను పట్టుకుని వారి నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తూ వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, కందుకూరు, బాలాపూర్, రాజేంద్రనగర్, షాద్‌నగర్, కడ్తాల్, ఆమనగల్లు, మంచాల, యాచారం వంటి మండలాల నుంచి రాత్రి సమయాల్లో వందలాది టిప్పర్ల ద్వారా సర్కారు, అసైన్డ్ భూముల నుంచి మట్టిని తీసి హైదరాబాద్‌కు తరలించి విక్రయిస్తున్నారు. నామమాత్రంగా కొంతమంది అధికారులు దాడులు చేసి టిప్పర్లను పట్టుకున్నప్పటికీ వందల్లో ఫైన్లు వేసి వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.