భారత సైన్యానికి ప్రజలు సలాం కొడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ముష్కరమూకలను తుదముట్టించింది. వ్యూహాత్మకంగా మెరుపుదాడులతో పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. పాక్ దొంగచాటుగా చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఆ దేశానికి చుక్కలు చూపిస్తుండడంతో భారతావని గర్వపడుతున్నది. భారత సైన్యానికి మద్దతుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ర్యాలీలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారతయుద్ధ వీరులకు సంపూర్ణ విజయం కలుగాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని మన దేశ మాజీ జవాన్లు మన సైన్యాన్ని అభినందిస్తున్నారు. దేశం పిలుపునిస్తే తాముకూడా యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.
పాకిస్థాన్ నామరూపాల్లేకుండా పోతుంది..
డిచ్పల్లి, మే 11 : ఏడో తరగతి చదువుతున్నప్పుటి నుంచే క్రీడల్లో ప్రతిభ కనబర్చడంతో ఆర్మీకి సెలెక్టయ్యాను. 15 ఏండ్లు సైన్యంలో సేవలందించి రిటైర్డ్ అయ్యాను. ఎన్నో ఉద్యోగాలు వచ్చిన కూడా వదులుకుని రైతులకు సేవలందించాలనే ఉద్దేశంతో కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం ఎంచుకున్నాను. అప్పుడు దేశానికి, ఇప్పుడు రైతులకు సేవలందించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొని అప్పటి రాష్ట్రపతి ద్వారా మెడల్ అందుకున్నాను.
సైన్యంలోనే ఉంటూ క్రీడల్లో కూడా అంతర్జాతీయ స్థాయి వరకు ఆడగలిగాను. సైన్యం నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులను ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ యుద్ధం జరిగితే నేను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలెవరూ కూడా భయభ్రాంతులకు గురికావొద్దు. ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన సైన్యం మన వద్ద ఉంది. పూర్తిస్థాయిలో యుద్ధం గనుక జరిగితే పాకిస్థాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తుంది మన సైన్యం.
– చామకూర బాగారెడ్డి, మాజీ హవల్దార్, బోర్గాం
పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి
నాకు చిన్నప్పటి నుంచి దేశం అంటే అమితమైన ప్రేమ. ఎస్సెస్సీ పూర్తి కాగానే 17 ఏండ్ల వయస్సులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాను. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో 2001 శిక్షణ పూర్తిచేసుకున్నాను. 2001 డిసెంబర్ 13న ఉగ్రవాదులు మన భారత పార్లమెంట్లో చొరబడి కాల్పులు జరిపారు. అప్పటి ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలని ఆపరేషన్ పరాక్రం చేపట్టింది. అప్పుడు మా అందరికి పాకిస్థాన్ బార్డర్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు అందాయి.
మొదటి పోస్టింగ్‌లోనే పాకిస్థాన్‌తో యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం కలిగింది. ఏడాది కాలం పాకిస్థాన్ బార్డర్లో ఆపరేషన్ పరాక్రంలో పాల్గొన్నందుకు చాలా గర్వంగా అనిపించింది. 2005లో జమ్ముకశ్మీర్‌లోని కిస్తువాడ్ సెక్టార్లో కౌంటర్ ఇంటెలిజెన్సీ ఆపరేషన్‌లో రెండేండ్లు పాల్గొన్న. ఆపరేషన్‌లో ఉగ్రవాదులను వేటాడాం. 2009లో చైనా బార్డర్ లే లాడాక్, సియాచిన్ గ్లెషియర్లో మంచుకొండల్లో రెండేండ్లు విధులు నిర్వహించాను. ఇప్పుడు కూడా మాలాంటి మాజీ సైనికులకు మళ్లీ యుద్ధానికి రమ్మని పిలుపు వస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను.
– బాలకృష్ణ, మాజీ హవల్దార్, గన్నర్, భవానీపేట్, బోధన్ మండలం
టూరిస్టులపై కాల్పులు..దారుణం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. 26 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను విడిచిపెట్టేదిలేదు. మతం తెలుసుకొని చంపడమనేది చాలా ఘోరం. పాకిస్థాన్‌కు మన సైన్యం దీటైనా జవాబు ఇస్తున్నది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది. డైరెక్ట్‌గా యుద్ధం ఎదుర్కొనలేక పిరికిపందలా ఉగ్రవాదులను పంపి టూరిస్టులపై కాల్పులు జరిపించింది. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం సంతోషం.
– కొండూర్ వసంత్‌రావు,మాజీ హవల్దార్, పాల్దా జన్నేపల్లి, నవీపేట్ మండలం
ఎలాంటి పరిస్థితినైనా మన ఆర్మీ ఎదుర్కొంటుంది
కోటగిరి, మే 11: 1994లో ఆర్మీలో సైనికుడి(సోల్జర్)గా ఉద్యోగంలో చేరిన. 17 ఏండ్లు విధులు నిర్వహించి హవల్దార్ హోదాలో 2011లో ఉద్యోగ విరమణ పొందాను. 24 గంటలు అప్రమత్తంగా ఉండేవాళ్లం. 1999 కార్గిల్ వార్‌లో పాల్గొన్న. నెల రోజుల పాటు యుద్ధం జరిగింది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. పార్లమెంట్‌పై దాడితోపాటు జమ్ముకశ్మీర్‌లో జరిగిన ప్రతి యుద్ధంలో పాల్గొన్న. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. యుద్ధంలో పాల్గొనాలని నాకు పిలుపువస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
– నాగ్నాథ్, రిటైర్డ్ ఆర్మీ జవాన్, కోటగిరి