నిజామాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తలపెట్టిన గ్రామ, వార్డు సభలు మంగళవారం తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హుల ఎంపిక జరుగుతుండగా, చాలాచోట్ల రేషన్ కార్డుల కోసమే ప్రజలు పోటెత్తారు. కొత్తగా దరఖాస్తులతో గ్రామసభలకు తరలివచ్చారు. కొన్నిచోట్ల నూతనంగా అప్లికేషన్లు స్వీకరించగా, మరికొన్ని చోట్ల స్వీకరించలేదని విమర్శలు వచ్చాయి. ఈ నెల 26 నుంచి రూ.12 వేల పెట్టుబడి సాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. వివరాల అప్డేట్ కోసం వ్యవసాయాధికారులు ఫోన్లు చేయకపోవడంతో చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు. వారసత్వ భూముల బదలాయింపు, కొత్తగా భూముల క్రయ, విక్రయాల్లో మారిన పట్టాదారులంతా ఇబ్బందులకు గురయ్యారు. వ్యవసాయాధికారులు మాత్రం ఫోన్లు చేస్తామంటూ రైతులను పంపించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలుండగా, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీ, నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 146 వార్డులు/డివిజన్లున్నాయి. గ్రామాల్లో 113, పురపాలక ఏరియాలో 20 కలిపి మొత్తం 133 క్లస్టర్లుగా విభజించారు. కామారెడ్డి జిల్లాలో 535 గ్రామ పంచాయతీలు, 80 మున్సిపల్ వార్డులున్నాయి. నాలుగు రోజుల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించేలా ప్రణాళికలను రచించినప్పటికీ సమయ పాలన పాటించ కపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే ప్రజా పాలన పేరిట ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులను స్వీకరించింది. దీంతో ప్రజలు భారీగా దరఖస్తులు చేసుకున్నారు. సర్కారు అందించే సాయాన్ని పొందేందుకు అర్హత పత్రాలతో వివరాలు అందించారు. కానీ ఇప్పటిదాకా పథకాల అమలు కాలేదు. ప్రజాపాలనలో అందించిన దరఖాస్తుల ప్రకారం రేషన్ కా ర్డు రాలేదు. ఈ మధ్యే కుటుంబ సర్వే ను నిర్వహించారు. ఇందులో వ్యక్తిగ త, స్థిర, చరాస్తులతో పాటు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల వివరాలను సైతం ప్రభు త్వం సేకరించిం ది. ఇలా రెండు విధాలుగా ప్రజల నుం చి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత తిరిగి గ్రామసభల పేరిట కార్యక్రమాలు నిర్వహించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పథకాలు అమలు చేసిందేమీ లేదు. ఆశ పెట్టి చావగొడుతున్నారంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన దరఖాస్తులనే గ్రామసభ, వార్డు సభల్లో చదివి వినిపించారు. ఇందులో పేరు లేని వారి నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకున్నారు. రేషన్ కార్డు మంజూరు పేరుతో మరికొన్ని పేర్లను వెల్లడించారు. ఈ ప్రక్రియ కొన్ని చోట్ల జనాలను ఆగమాగం చేసింది. పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడ చూసినా అత్యధికులు రేషన్ కార్డుల కోసమే గ్రామసభలకు వచ్చారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసిన వారు ఉన్నారు. గతంలో మీసేవలో దరఖాస్తు చేసి రేషన్ కార్డులు రాని వారికి గ్రామ సభల్లో ఊరట దక్కింది. ఇక్కడ అర్హుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో ఇందిరమ్మ కమిటీలు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. ప్రభుత్వ అధికారుల బృందాలకే నిర్ణయాధికారం ఉండడం తో కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ సభల్లో, వార్డు సభల్లో అంతా పరిశీలక బృందాలదే పెత్తనం ఉండడంతో వీరంతా మిన్నకుండి పోవాల్సి వచ్చింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తీరుతెన్నులపై ఇందిరమ్మ కమిటీల్లో భాగస్వామ్యమైన వారికి అవగాహన లేకపోవడం, ఇంత వరకూ విధివిధానాలను సరైన రీతిలో వెల్లడించక పోవడంతో అయోమయం నెలకొంది. గ్రామాల్లో తాజా మాజీలు, గ్రామాల్లో పెద్దరికం చేసే వ్యక్తులు ప్రభావం చూపుతున్నారు. పట్టణ, నగరాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూర్చుంటున్నారు. అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజ లు స్థానిక కాంగ్రెస్ లీడర్లను సంప్రదిస్తుండగా, ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.