మోర్తాడ్, ఏప్రిల్ 21: వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన తెలంగాణ రైతులను అవమానించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ వెంటనే యావత్ తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులకు ఆంధ్రప్రాంతం వారు వ్యవసాయం నేర్పించారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై వేముల ఘాటుగా స్పందించారు.
పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో యావత్‌తెలంగాణ సమాజాన్ని అవమాన పరిచినట్లేనని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ సర్కారు, రైతు మహోత్సవ వేడుకలు జరుపుకోవడం చంపినోడే…సంతాపసభ పెట్టినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పేది అక్షరసత్యమని, బీఆర్ఎస్కు తప్ప, తెలంగాణ మీద ప్రేమ ఏ రాజకీయపార్టీకీ ఉండదని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర భావదారిద్య్రంలో ఉన్నారని, ఆంధ్రపాలకుల మన్ననల కోసం ఇంకా పాకులాడడం సిగ్గుచేటని విమర్శించారు.
తెలంగాణ వ్యవసాయ చరిత్ర తెలియని వ్యక్తులు, తెలంగాణకు పాలకులు కావడం ప్రజల దౌర్భాగ్యమని పేర్కొన్నారు. ఆంధ్రలోని కోస్తా ప్రాంతం లో వరి తప్ప ఏదీ పండించరని, కానీ తెలంగాణలో వరితో పాటు వాణిజ్య పంటలైన పత్తి, పసుపు, చెరుకు, మిర్చి, మక్కజొన్న లాంటి పంటలు పండిస్తారని తెలిపారు. పల్లి, శనగ, పెసర, కందులు, మినుములు లాంటి ఆహారధాన్యాలు పండిస్తారని, వెయ్యేండ్ల క్రితమే దక్కన్ ప్రాంతంలో సన్నబియ్యం పండించిన చరిత్ర తెలంగాణ రైతులదని గుర్తు చేశారు.