ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 12: పంచాయతీ పోరులో పట్నం ఓటర్లు కీలకంగా మారారు. ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభావితమవుతున్న తరుణంలో వలస ఓటర్లను స్వగ్రామాలకు రప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్లు ఉంటున్న పట్టణాలకు వెళ్లి వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 14న స్వస్థలాలకు వచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరుతున్నారు. ఇందుకోసం దారి ఖర్చుల పేరిట ఒక్కో ఓటుకు రూ.2 వేల దాకా ముట్టజెబుతున్నారు.
ఎల్లారెడ్డి డివిజన్లోని ప్రతి గ్రామం నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. విద్య, ఉద్యోగావకాశాల కోసం వేలాది మంది హైదరాబాద్ సహా వివిధ పట్టణాల్లో నివాసముంటున్నారు. ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాల నుంచి దాదాపు 6 వేల మందికి పైగా, నాగిరెడ్డిపేట మండ లం నుంచి 2 వేల మంది కుటుంబాలతో సహా ఓటర్లు వలస వెళ్లారు. చిన్న గ్రామపంచాయతీల్లో అయితే 100 మంది దాకా, మేజర్ జీపీల్లో అయితే 200 నుంచి 400 మందికి పైగా వలస వెళ్లిన వారున్నారు. వీరంతా హైదరాబాద్‌లోని గండిమైసమ్మ, సూరారం, మేడ్చల్, బాలానగర్, కొంపల్లి, సుచిత్ర, కుత్భుల్లాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, జీడిమెట్ల, బోయిన్పల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో నివాసముంటున్నారు. మరికొంత మంది ఇతర జిల్లాల్లో ఉంటున్నారు.
రెండో విడుత ఎన్నికలు జరుగనున్న మెజార్టీ గ్రామపంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 600 లోపే ఉంది. ప్రతి పల్లెలోనూ పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఒక్కో ఓటు కూడా కీలకంగా మారింది. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభావితం కానున్న తరుణంలో వలస ఓట్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. వలస వెళ్లిన ఓటర్లను ఎలాగైనా పోలింగ్ రోజు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఓటర్ జాబితాల ఆధారంగా ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట్ మండలాల నుంచి కనీసం 8 వేల మందికి పైగా ఓటర్లు పట్టణాల్లో ఉంటున్నట్లు లెక్క తేల్చిన అభ్యర్థులు..
వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తమ గ్రామస్తుల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రత్యేక విందు సమావేశాలు ఏర్పాట్లు చేస్తూ, ఈ నెల 14వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. అలాగే, వలస ఓటర్లతో సన్నిహిత సంబంధాలు కలిగిన వారి ద్వారా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు పోలింగ్ రోజు గ్రామాలకు రావడానికి గాను అభ్యర్థులు దారి ఖర్చుల కింద డబ్బులు ఇస్తున్నారు. బస్సు చార్జీల పేరిట ఒక్కో ఓటుకు రూ.2 వేల దాకా ముట్టజెప్తున్నారు. మరికొందరైతే ప్రత్యేక వాహనాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే కావడంతో హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తే ఆలస్యమవుతుందన్న భావనతో వాహనాలు సమకూర్చుతుండడం గమనార్హం.