ఖలీల్‌వాడి, నవంబర్ 15 : నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఏడంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ జనరల్ దవాఖాన సమస్యల వలయంగా మారింది. బయట నుంచి చూస్తే అద్దాల మేడగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో రోగులతోపాటు పేషెంట్లతో ఉండే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దవాఖానలో అన్ని వసతులు కల్పించడంతో పాటు కోట్ల రూపాయలతో పరికరాలు, ఖరీదైన వైద్యం, క్యాథ్‌ల్యాబ్, సిటీస్కాన్ తదితర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చి, నిరుపేదలకు అత్యాధునిక పరికరాలతో వైద్యసేవలను సులభతరం చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ప్రభుత్వ దవాఖాన పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన అంటే పెట్టింది పేరు. మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిర్మల్ నుంచి రోగులు వస్తుంటారు. రోజురోజుకూ దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ దవాఖానలో సరైన సౌకర్యాలు సమకూర్చడం లేదు. దవాఖానలో విరిగిన బెడ్లు, పేషెంట్‌తో వచ్చిన వారు కూర్చుండేందుకు స్టూళ్లు లేకపోవడం, పలు గదుల్లో వాటర్ లీకేజీ, తాగేందుకు నీరు లేకపోవడం తదితర సమస్యలతో రోగులు, దవాఖానకు వచ్చే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో చాలా సీనియర్ డాక్టర్లు ఉండే వారు. ఒక్క రోజులోనే 67 ఆపరేషన్లు చేసి రాష్ట్రంలో నంబర్‌వన్ దవాఖానగా నిలిచింది జీజీహెచ్. నిజామాబాద్‌లో 300 పైగా మోకాళ్ల చిప్పల మార్పిడి జరిగితే రాష్ట్ర మంతా అభినందించిన ప్రభుత్వ దవాఖానలో ప్రస్తుతం వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంది వైద్యులను బదిలీ చేయడంతో ఒక్కసారిగా వైద్యసేవలను అందించడంలో పరిస్థితి తారుమారు అయ్యింది. కొందరు వైద్యులు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేస్తున్నా మందుల కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు.
మొదటి అంతస్తులో డెలివరీ వార్డులో కూర్చునేందుకు స్టూళ్లు, రేకులు లేవు. రెండో అంతస్తులో రోగుల బెడ్లు విరిగిపోయి ఉన్నాయి. జనరల్ వార్డులోని బాత్రూంలలో వాటర్ రావడంలేదు. బెడ్లు విరిగిపోయి ఉన్నాయి. ప్రతి వార్డులో సింకులు ఏర్పాటు చేశారు. కానీ వాటర్ సౌకర్యం మాత్రం లేదు. ఫ్లోర్ పగిలిపోయి ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. పేరుకు నాలుగు లిఫ్ట్‌లు ఉన్నా రెండు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిని వైద్యులు మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో వివిధ రోగాలతో బాధపడుతున్న వారు పైఅంతస్తులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మందుల విషయానికి వస్తే కొన్ని మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేదలు బయటకొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానకు వస్తే మందులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టాలి. దవాఖానలో చాలా సమస్యలు ఉన్నాయి. రోగుల బెడ్లు విరిగిపోయి ఉన్నాయి. దవాఖానకు వచ్చే అధికారులకు పగిలిన ఫ్లోర్లు కనిపించడం లేదా?. దవాఖానలో వసతులు కల్పించి, మందులు అందుబాటులో ఉంచి, రోగులకు మంచి వైద్య సేవలు అందించాలి.
– సుజాత, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి