Panchayat Secretaries | బిచ్కుంద, ఆగస్టు 02 : గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి పంచాయతీ కార్యదర్శులు ముందుండి పనిచేస్తూ, పని భారంతో సతమతమవుతున్నారు. రోజువారి పనులలో కాకుండా తమను ఆర్థికపరమైన అంశాల నుండి మినహాయించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పంచాయతీ కార్యదర్శులు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వేణుగోపాలకు వినతి పత్రం అందజేశారు. వినతి పత్రాన్ని ఎంపీడీవోతో పాటు ఎంపీఓకు అందజేయగా వినతిపత్రం తీసుకోవడానికి ఎంపీఓ సుముఖత చూపలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారి విధులతో పాటు ప్రభుత్వం అదనంగా ఇస్తున్న సర్వేలతోపాటు ఇతరత్రా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీటి ఒత్తిడితో పని భారం ఎక్కువై పంచాయతీ కార్యదర్శులు ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన దగ్గర నుండి వివిధ రకాల సర్వేలతో రోజు గడుస్తుందని గ్రామంలో వివిధ పనుల కొరకు పంచాయతీ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు పని చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర శాఖల పనులు తమతో చేపించడం వలన పని భారం పెరిగి పని ఒత్తిడితో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, పచ్చదనం పెంపు వంటి మాలిక సదుపాయాల కల్పనకు అప్పులు చేసి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెచ్చిన అప్పులు తీర్చలేక గ్రామాలలో తిరగలేకపోతున్నామన్నారు. విషయమై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ ప్రొఫెషన్ డిక్లరేషన్ చేయడంతో పాటు ఓపీఎస్లను, జేపీఎస్‌లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.