ఖలీల్వాడి, మార్చి 3 ; యాసంగి సీజన్లో వరి పంట చేతికి వచ్చే సమయంలో రైతులకు సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేసవికి ముందే బోర్లు ఎత్తిపోతుండడంతో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఆయకట్టు శివారుల్లోని భూములకు సాగునీరు అందక రైతులు అల్లాడిపోతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. సాగునీరు అందించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వ వైఫల్యం రైతులకు శాపంగా మారింది. పలుగ్రామాల్లో చెరువులు ఎండిపోయి మైదానాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు రైతుభరోసా ఇవ్వకపోవడం, మరోవైపు సాగునీటి ఇబ్బందులను తీర్చకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కేసీఆర్ హయాంలోనే సాగు బాగు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా సాగునీటి ఇబ్బందులు తలెత్తలేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ‘కాళేశ్వరం’తో ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని అందించి రైతులకు కష్టాలను దూరం చేశారని కొనియాడుతున్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు నీటిని అందించి, వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. పదేండ్ల కాలంలో విద్యుత్, ఎరువులు, పెట్టుబడి సాయం సకాలంలో అందించేవారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువులు, పెట్టుబడి సాయం అటుంచితే, పంటలకు నీళ్లను అందించలేని పరిస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అద్దెకు ట్యాంకర్లు.. పంటలకు నీళ్లు
మోపాల్ మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. నీటి వనరులు తగ్గిపోతుండడం, పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందిస్తున్నారు. గత నెలాఖరులోనే బోరుబావులు ఎండిపోవడంతో అప్పులు చేసి ట్యాంకర్లను అద్దెకు మాట్లాడుకున్నారు. రోజువారి అద్దె చొప్పున పంటలకు నీరందిస్తున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితి 12 ఏండ్ల క్రితం వచ్చిందంటే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు నోరు మెదకపోవడం గమనార్హం.
బోరు నీరు ఆగుకుంట వస్తున్నది
ఎనిమిదెకరాల్లో పంట పండిస్తున్నాం. బోరు నీరు ఆగుకుంటా వస్తున్నది.ఇంకో 15 రోజులు అయి తే అది కూడా రాదు. ఇలా ఉంటే పంట సగానికి పైగా నష్టపోయే అవకాశం ఉన్నది. నిజామాబాద్ అంతతా ఇదే పరిస్థితి నెలకొన్నది.
-గంగారెడ్డి, రైతు, బాడ్సి
ఇప్పటికే పంట నష్టపోయిన
నాకు ఉన్న ఆరు ఎకరాల్లో పంట సాగుచేస్తున్న. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నం. ఇప్పటివరకూ రెండు బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. నీళ్లు లేక పంట ఎండిపోయింది. ఏం చేయా లో తెలియని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ మమ్మల్ని ఆదుకోవాలి.
-ముత్యంరెడ్డి, రైతు, సిర్పూర్, మోపాల్ మండలం
చాలా ఇబ్బందులు పడుతున్నం..
మండలంలో ఎక్కడ చూసినా చెరువులు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో మైదానాలను తలపిస్తున్నాయి. పంటలకు నీళ్లందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. బోర్లు ఆగుకుంట పోస్తున్నయి. రానున్న రోజుల్లో బోర్లు వట్టిపోయే పరిస్థితి నెలకొన్నది. పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నది.
-కంజర భూమయ్య, రైతు, కంజర గ్రామం