డిచ్పల్లి, జూన్ 27: కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించింది. ఇందుకోసం చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఇచ్చింది. ఒకసారి పంట వేస్తే.. నాలుగు సంవత్సరాల అనంతరం 30 ఏండ్ల వరకు నిరంతరం పంట చేతికి వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు అధికారులు అవగాహన కల్పించడంతో డిచ్పల్లి మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన కన్నె జగన్ ఆయిల్‌పామ్ పంటను సాగుచేశాడు.
పంట చేతికి రావడంతో గెలల కోతను శుక్రవారం ప్రారంభించారు. ఆయిల్‌పామ్ పంట సాగుచేస్తే.. ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తుందని మండల ఉద్యానశాఖ అధికారి జిట్ల రోహిత్ తెలిపారు. పంటకు కోతులు, అడవి పందులు, దొంగల బెడద ఉండదన్నారు. తక్కువ మంది కూలీలు అవసరం అని చెప్పారు. ఎన్ఎంఈవో-ఓపీ స్కీమ్ ద్వారా సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.
రైతు ఎకరానికి రూ.వేయి డీడీని జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి, నిజామాబాద్ పేరిట చెల్లిస్తే ఫ్రీ యూనిక్ కంపెనీ వారు 50 మొక్కలను 90 శాతం రాయితీపై అందిస్తారన్నారు. ఆయిల్‌పామ్ మొక్కల మధ్యలో అంతరపంటలు (మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా) సాగు చేసుకునేందుకు ఎకరానికి రూ.4,200 చొప్పున ఏడాదికి ఒకసారి ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. ఐదు ఎకరాలల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, 5 ఎకరాల పై సాగుచేసే వారికి 80 శాతం రాయితీపై డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. గెలల కోతలో క్లస్టర్ ప్రతినిధి భూమేశ్, రైతులు కన్నె జగన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.