ఎరువులు, విత్తనాల దుకాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ, కాలం చెల్లిన విత్తనాలు విక్రయించే వారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాల్లో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పలువురు డీలర్లను మందలించారు. బోధన్‌లోని ఓ దుకాణంలో స్టాక్ బుక్‌లో వివరాలు, బిల్బుక్లో వివరాల నమోదులో లోటుపాట్లు ఉండడంతో డీలర్‌పై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వ్యవసాయ శాఖలోని కొంత మంది అధికారుల తీరుతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఫెర్టిలైజర్స్, సీడ్ దుకాణాల్లో రసాయన మందుల విక్రయాలు, ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో నిబంధలను తుంగలోకి తొక్కుతున్నారు. పుట్టగొడుగుల్లా వెలసిన దుకాణాల్లో వింత పరిస్థితి ఎదురవుతున్నా.. కనీసం పట్టించుకునే వారు కరువయ్యారు. ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో వ్యవసాయ అనుబంధ శాస్త్రల్లో డిగ్రీ, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు మాత్రమే మందులు, ఎరువులు విక్రయించాల్సి ఉండ గా.. ఈ నిబంధన ఎక్కడా అమలుకాకపోవడం గమనార్హం. మండల కేంద్రాల్లో వెలసిన ఫర్టిలైజర్స్ దుకాణాల్లో కొంత మంది ఏవోల కనుసన్నల్లోనే అనధికార విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నిరంతర తనిఖీలు చేయకపోవడంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలెక్టర్లు శుక్రవారం ఆకస్మికంగా ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాలను తనిఖీచేయగా.. నిర్వహణలో లోటుపాట్లు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. బోధన్‌లో స్టాక్, ఇతర వివరాల నమోదులో నిర్లక్ష్యం బయటపడడంతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
వానకాలం సీజన్‌కు ముందే ఉమ్మడి జిల్లాలో అనేకచోట్ల రైతులకు జీలుగ విత్తనాల కోసం కుస్తీపాట్లు పడాల్సి వచ్చింది. దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా సమైక్య పాలనలో ఎదురైన అనుభవాలను ఎదుర్కొన్నారు. చెప్పులు, పాస్‌పుస్తకాలను క్యూలో ఉంచి మండుటెండలో బారులు తీరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు పహారా మధ్య జీలుగ విత్తనాలు పంపిణీ చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి చేయి దాటుతుండడంతో తేరుకున్న ప్రభుత్వం ఒక్కసారిగా కలెక్టర్లను రంగంలోకి దించింది. రైతుల అవసరాల మేరకు విత్తన పంపిణీ చేయిస్తుండడంతోపాటు తనిఖీలకు ఆదేశాలివ్వడంతో అక్రమార్కులకు ముకుతాడు పడుతోంది. తనిఖీల్లో ఇప్పటికే ఆర్మూర్ మండలం సుబ్బిర్యాల్లో 5,540 కిలోల వరి, 360 కిలోల మొక్కజొన్న, 810 కిలోల సోయాబీన్ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మూర్‌లోని బాలాజీ సీడ్స్ అండ్ పెస్టిసైడ్‌లో గడువు ముగిసిన రూ.14వేలు విలువ చేసే ఉల్లి, కూరగాయల విత్తనాలు పోలీసుల దాడుల్లో పట్టుబడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో 66 కొనుగోలు కేంద్రాలకు 6155 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించగా.. ఇప్పటికే 5564క్వింటాళ్ల విత్తనాలను 60శాతం రాయితీతో రైతులకు పంపిణీ చేశారు. జిల్లాలోని రైతుల అవసరాల మేరకు జీలుగ విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇప్పుడిప్పుడు సక్రమ పద్ధతిలో జీలుగ విత్తనాలను అందిస్తున్నారు.
రైతులు విడిగా విత్తనాలను కొనుగోలు చేయవద్దు. ప్యాకెట్ సీల్ చేసిన విత్తనాలనే కొనుగోలు చేయాలి. లారీలు, ఆటోల్లో రాత్రివేళల్లో తీసుకువచ్చే విత్తనాలు తీసుకుని మోసపోవద్దు. ప్రభుత్వం లైసెన్సు మంజూరు చేసిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసి రసీదును తీసుకోవాలి. రసీదుపై లాట్ నంబర్ సహా విత్తన రకం, ఇతర పూర్తి వివరాలు తీసుకోవాలి. రైతులకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే ఏవోలు, ఏఈవోలను సంప్రదించవచ్చు.
అధికారుల తనిఖీలతో విత్తన, ఎరువుల విక్రయదారుల్లో వణుకు మొదలైంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న వారి వ్యాపారాల్లో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. రంగంలోకి కలెక్టర్లే దిగడంతో భయంతో తారుమారైన రికార్డులను సవరించుకునే పరిస్థితిలో మునిగి తేలడం ఉమ్మడి జిల్లాలో కనిపించింది. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన్‌లో పర్యటించారు. ఎరువులు, విత్తన దుకాణాల్లో రికార్డులు, నిల్వలు, పంపిణీ చేసిన రైతుల వివరాలు, రసీదులు వాటిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సైతం భిక్కనూర్ మండలంలో పర్యటించారు. డీఏవోతో కలిసి పలు ఎరువులు, విత్తన దుకాణాల్లో రికార్డులను పరిశీలించి పలువురిని మందలించారు. వివరాలను సరిగా నమోదు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు సైతం నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ల తనిఖీల సమాచారం తెలుసుకున్న మిగిలిన దుకాణాదారులంతా భయంతో వణికిపోయినట్లు తెలిసింది. ఏవోలు, ఏఈవోలు అంతా వాట్సప్‌లో సమాచారం చేరవేసి అందరినీ అప్రమత్తం చేయడంతో తప్పులు చేసిన వారంతా సరిదిద్దుకుంటున్నట్లు సమాచారం.