హైదరాబాద్, మార్చి 5: ప్రముఖ మొబైల్ సంస్థ సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్ మొబైళ్లు రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ మాస్టర్ టెలికమ్యూనికేషన్స్‌కు పంజాగుట్టలో ఉన్న స్టోర్‌లో ఈ మొబైళ్లు గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ ఫోన్లను కంపెనీ యజమాని సమీర్ మహ్మద్‌తోపాటు సామ్సంగ్ అధికారులు అందించారు. ఈ కార్యక్రమానికి సామ్సంగ్ ప్రాంతీయ విక్రయాల మేనేజర్ మురళీధరన్, ప్రాంతీయ మార్కెటింగ్ మేనేజర్ నిఖిల్, జోనల్ విక్రయాల మేనేజర్ ఉపేంద్ర అశోక్ తదితరులు హాజరయ్యారు.
గెలాక్సీ ఎస్ 26 సిరీస్‌లో ప్రైవసీ రక్షణ, పనితీరు, కృత్రిమ మేధస్సు సదుపాయాలపై సామ్సంగ్ ప్రధానంగా దృష్టి సారించింది. సరికొత్తగా విడుదల చేసిన ఎస్ 26 అల్టా మాడల్‌లో ప్రైవసీ డిస్ప్లే వినూత్న సాంకేతికతను అందించింది. ఈ సిరీస్‌లోని ఫోన్లు శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఎస్26 అల్ట్రాలో 6.9 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120 హెరట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం ఎస్26లో 4,300 ఎంఏహెచ్, ఎస్26 ప్లస్‌లో 4,900 ఎంఏహెచ్, ఎస్26 అల్ట్రాలో 5,000 ఎంఏహెచ్‌గా ఉంది. ఎస్26 అల్ట్రా మోడల్లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా వైడ్ టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి.
భారత మార్కెట్లో గెలాక్సీ ఎస్26 రూ.87,999 ప్రారంభ ధరతో లభించనున్నాయి. అలాగే ఎస్26 ప్లస్ ధర రూ.1,19,999గాను, ఎస్26 అల్ట్రా 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.1,39,999 కాగా, 12 జీబీ+ 512 జీబీ రకం రూ.1,59,999, 16 జీబీ + 1 టెరాబైట్ వేరియంట్ రూ.1,89,999గా నిర్ణయించారు.