Drugs Test | జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. సినిమా ఇండస్ట్రీలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిందంటూ ఆయన చేసిన ఆరోపణలు రాజకీయాలు, సినీ రంగాల మధ్య వాగ్వాదానికి కారణమయ్యాయి. ఈ వివాదానికి కారణమైన అంశం ఏమిటంటే, నటీనటులందరికీ డ్రగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని అనిరుధ్ రెడ్డి చేసిన డిమాండ్. ప్రతి 90 రోజులకు ఒకసారి నటీనటులు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని, ఆ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వస్తేనే వారి సినిమాలకు రిలీజ్ అనుమతి ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కూడా కోరారు.
అలాగే ప్రజలు రాజకీయ నాయకుల కంటే హీరోలు, నటీనటుల మాటలను ఎక్కువగా వింటారని, వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసితే అభిమానులు కూడా వారిని దూరంగా పెడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీశాయి.ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు రాహుల్ రామకృష్ణ ఆసక్తికరంగా స్పందించారు. తాను హీరో కాకపోయినా డ్రగ్ టెస్టులకు సిద్ధమేనని పేర్కొంటూ, వెంటనే ప్రభుత్వం జీవో జారీ చేస్తే అందరం కలిసి టెస్టులు చేయించుకుందామని అన్నారు. అయితే అదే సమయంలో రాజకీయ నాయకులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
‘‘మేము డ్రగ్ టెస్టులు చేస్తే, మీరు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుంటారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఆదివారం నటీనటులు డ్రగ్ టెస్టులు, రాజకీయ నాయకులు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుంటే ప్రజలకు నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అది వైరల్గా మారింది. మరోవైపు నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందిస్తూ, ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు రాజకీయ నాయకులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయాలు vs సినిమా ఇండస్ట్రీగా మారింది. ఒకవైపు డ్రగ్స్ నియంత్రణ పేరుతో కఠిన చర్యలు తీసుకోవాలని రాజకీయ వర్గాలు చెబుతుంటే, మరోవైపు సినీ ప్రముఖులు ఒకే రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని అంటున్నారు.