నిజామాబాద్, మార్చి 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇంధన కొరతపై వెల్లువెత్తిన వదంతులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మంగళవారం రాత్రి నుంచే పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రచారం జోరుగా జరగడంతో ప్రజలంతా ఆగమాగం అయ్యారు. అర్ధరాత్రి నుంచే పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ద్విచక్ర వాహనాదారులు, కార్లు, భారీ వాణిజ్య వాహనాల్లో పెద్ద ఎత్తున ఇంధనం నింపుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. రాత్రి వేళా సాధారణంగా పెట్రోల్ బంకుల్లో తక్కువ గిరాకి ఉండటం సర్వసాధారణం.
అయితే కొరత పేరుతో జరిగిన వదంతుల మూలంగా భారీ ఎత్తున వాహనాదారులు వరుస కట్టడంతో తీరిక లేకుండా ఇంధన సరఫరా జరిగింది. దావళంగా ప్రచారం వ్యాప్తి చెందడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎక్కడ చూసినా భారీ క్యూలైన్లు దర్శనం ఇచ్చాయి. నిజామాబాద్ నగరంలో ఎటు చూసినా రద్దీతో బంకులు కిక్కిరిసి పోయాయి. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో చాలా మంది బెంబేళెత్తి పోయారు. నిజమే కావొచ్చు అనే స్థాయిలో ఆందోళనకు గురై పెట్రోల్, డీజిల్ కోసం ఎగబడ్డారు. కామారెడ్డి జిల్లాలోనూ ఈ పరిస్థితి ఎదురైంది. ఉమ్మడి జిల్లాలో మండల, గ్రామ స్థాయిలోనూ వదంతులు ప్రచారం కావడంతో భారీగా క్యూలైన్లు దర్శనం ఇచ్చాయి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇంధన కొరత లేదంటూ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రజల అవసరాలకు సరిపడా స్టాక్ ఉందని ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం సైతం వదంతుల వార్తలను ఖండించింది. కొరత లేదని పౌరసరఫరాల శాఖ చెబుతోంది. కల్పిత ప్రచారాలతో జనాలు పెట్రోల్ బంకులకు వెళ్లి అవసరానికి మించి ఇంధనాన్ని కొంటున్నారని ప్రకటించారు. ఎవరైనా పెట్రోల్ బంకు నిర్వాహకులు కల్పిత కొరత సృష్టిస్తే ఫిర్యాదు చేయాలని ప్రజలను సూచిస్తున్నారు. ఎవరైనా కొరతను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
సందట్లో సడేమియా మాదిరిగా పలు పెట్రోల్ బంకుల్లో జనాల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ప్రీమియం పెట్రోల్ విక్రయిస్తున్నారు. వాహనాదారులంతా దిక్కులేక అధిక ధరకు ప్రీమియం పెట్రోల్‌ను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బంకుల్లో రద్దీ కనిపించగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రద్దీ తగ్గుముఖం పట్టడం కనిపించింది. అన్నా… ఫుల్ ట్యాంక్… భయ్యా ట్యాంక్ ఫుల్ కరో… మాటలతో బంకులు మారుమోగాయి. వేల రూపాయలు వెచ్చించి పెట్రోల్, డీజిల్ నింపుకోవడం సర్వత్రా కనిపించింది. వదంతుల వ్యాప్తి వల్ల ఇంధన కొరత ఏర్పడితే ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. మరికొందరు ధరలు పెరుగుతాయనే భయంతోనూ పరుగులు పెట్టారు.
ఉమ్మడి జిల్లాలోని పెట్రోల్ బంకులు వాహనదారులతో కిటకిటలాడాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే రద్దీగా మారాయి. పెట్రోల్ కొరత ఏర్పడిందన్న పుకార్లు వ్యాపించడంతో జనం ఆందోళనకు గురయ్యారు. తెల్లవారుజాము నుంచే బంకుల్లో బారులు తీరారు. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, బోధన్, కోటగిరి, వేల్పూర్ తదితర ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో తీవ్ర రద్దీ కనిపించింది. ట్యాంకులు ఫుల్ చేయించడంతో స్టాక్ అయిపోయింది. దీంతో చాలాచోట్ల ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. మరోవైపు, పెట్రోల్, డీజిల్ కొరత లేదని సీపీ సాయిచైతన్య తెలిపారు. కొరత ఉన్నట్లు ఎవరైనా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.