బాన్సువాడ, డిసెంబర్ 28: నిజాంసాగర్ ఆయకట్టు రైతులు నీటిని వృథా చేయొద్దని, వరినాట్లు త్వరగా పూర్తి చేసుకోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. నాట్లు త్వరగా పూర్తి చేస్తే మార్చి చివరికల్లా పంటలు కోత దశకు వస్తాయని, దీంతో వడగండ్ల వాన నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. బాన్సువాడలో గురవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. విలేకరులతో మాట్లాడారు. నాలుగు, ఐదేండ్లుగా తమ సూచనలు పాటించి లబ్ధి పొందారని తెలిపారు. ఇటీవల కొంతమంది తాము చెప్తేనే నీటిని విడుదల చేస్తారని చెప్పుకుంటున్నారని, నిజాంసాగర్ నీరు రైతుల హక్కు అని, ఎవరో చెబితే జరిగేది కాదనే విషయాన్ని వారు గుర్తించాలని అన్నారు. 30ఏండ్ల నుంచి నీటి విడుదల యథావిధిగా కొనసాగుతున్న చర్యేనని, ఆ విషయంలో ఎవరి మెహర్బానీ, ఎవరి ఒత్తిడి, రాజకీయ ప్రమేయం అవసరం లేదన్నారు. రైతుల అవసరాలను గుర్తించి అధికారులే నీటిని విడుదల చేస్తారని, అవసరమైతే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అయిన తన సూచనలు తీసుకుంటారని తెలిపారు.రైతాంగానికి కష్టకాలంలో కూడా సాగునీరందించి పంటలను బతికించామని గుర్తుచేశారు. సాగర్ నీరు చివరి ఆయకట్టుకు చేరేలా రూ.150కోట్లతో కాలువలు బాగు చేయించానని, ఎక్కడ కూడా నీరు వృథా పోదని తెలిపారు.
ప్రజాపాలన పేరిట ఆరు హామీలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారని, ఇదంతా పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసి కొత్త నాటకాన్ని సృష్టిస్తారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా తు.చ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి ఇంకా అమ లు చేయలేదని, ఎకరానికి రూ.15వేలు పంట పెట్టుబడి సాయం వేయలేదని, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అని చెప్పారని, మీరిచ్చిన హామీలను మీకు గుర్తుచేస్తన్నామని అన్నారు. గత ప్రభుత్వంలో తమ కుటుంబం రైతుబంధు తీసుకోలేదని, ఇప్పుడు అవసరం ఉన్నందున తాము కూడా దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు. తమ హయాంలో కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు సంపదను పంచిపెట్టామని తెలిపారు. గత ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని సూచించారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఏర్వాల కృష్ణారెడ్డి, ప్రమోద్ రెడ్డి తదితరులు ఉన్నారు.