నిజామాబాద్, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా నిండుకుండను తలపిస్తోంది. ఎటు చూసిన జల సవ్వళ్లతో కనిపిస్తోంది. అలుగు పారుతోన్న చెరువులు, గేట్లు తెరుచుకున్న భారీ ప్రాజెక్టులు, ఉప్పొంగుతోన్న చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతో జల సందడి నెలకొంది. నాలుగు రోజులుగా కురుస్తోన్న వానలతో రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్లు అయ్యింది. ఖాళీ కుండల్లా మారిన చిన్న, మధ్య, భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో మొదలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు వరద నీటితో పోటెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోదావరి, మంజీరా నదులతో పాటుగా కప్పల వాగు, పసుపు వాగు, పెద్ద వాగు, ఫులాంగ్ వాగు, పాంగ్రా వాగు భారీ వరదను మూటగట్టుకుని సరికొత్త కాంతులతో కనిపిస్తోంది. వానాకాలం సీజన్ ఆరంభంలో చుక్కలు చూపించిన వానలు ఇప్పుడేకంగా ఊరూరా జల పండుగను తీసుకు వచ్చింది. మంజీరా నదిలో ఉధృతంగా వరద రావడంతో బిచ్కుందలో పలువురు గొల్ల కాపరులు, మూగ జీవాలు చిక్కుకోగా ఎన్డీఆర్ఎఫ్ దళాలు రం గంలోకి దిగి రక్షించారు. పురాతన ఇళ్లలో జీవనం సాగిస్తోన్న వారిని ఇతర ప్రాంతాలకు యంత్రాంగం తరలించింది.
నిజామాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. మొన్నటి వరకు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడిన రైతులకు జోరు వానలు ఆనందం నింపగా పొలాల్లో నిలిచిన వరద నీటితో బెంగ పట్టుకుంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో భారీ వానలు, వరదల నేపథ్యంలో సోమవారం రోజుకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ నిర్ణయం తీసుకున్నారు.
గోదావరి ఉప నది మంజీరా నది సైతం ఉరుకలేస్తోంది. సింగూర్ డ్యామ్ నుంచి 50వేల క్యూసెక్కులు వరద దిగువకు వదలడం, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వానలు కురుస్తుండటంతో ఎగువ నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మంజీరా ఉగ్రరూపం దాల్చింది. గరిష్టంగా 1లక్షా క్యూసెక్కులు వరద నిజాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తింది. 1లక్షా 10వేల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో కొనసాగించారు. ఓవైపు సింగూర్, మరోవైపు పోచారం ప్రాజెక్టు నుంచి వస్తోన్న వరదతో నిజాంసాగర్ ప్రాజెక్టు సైతం నిండుకుండను తలపిస్తోంది. మెదక్ జిల్లాలోని పస్పేర్ వాగు నుంచి ఉధృతంగా వరద నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుతోంది. భారీ వరదను కంట్రోల్ చేసేందుకు ఉదయం 8గంటలకే 7గేట్లను ఎత్తి దిగువకు వరదను వదిలారు.
మధ్యాహ్నానికి 13గేట్లు ఎత్తారు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో భారీ, మధ్యతరహా ప్రాజెక్టులున్నాయి. 17.802 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్ ప్రాజెక్టును 15.667 టీఎంసీలు స్థిర నిల్వతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతూ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యం గల కళ్యాణి ప్రాజెక్టు 409.50 గరిష్ట నీటిమట్టాన్ని దాటింది. 1.237 టీఎంసీలు సామర్థ్యం గల కౌలాస్‌నాలా ప్రాజెక్టుకు 20వేల క్యూసెక్కులు వరద రావడంతో మూడు గేట్లను తెరిచారు. నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో భారీగా రాగా రెండు రోజుల నుంచే గేట్లు ఎత్తారు. సింగీతం ప్రాజెక్టు ఓవర్ ఫ్లోకు గురయ్యే ప్రమాదాన్ని పసిగట్టి ముందస్తుగానే గేట్లు ఎత్తివేశారు. పోచారం ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ 1464 అడుగులకు చేరి మూడు రోజులుగా ఉప్పొంగుతోంది.
నిజామాబాద్ జిల్లాలో(ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ పరిధిలో) 996 చెరువులున్నాయి. ఇందులో సోమవారం రోజు 73 చెరువులు మత్తడి దుంకినట్లుగా ఇరిగేషన్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 184 చెరువుల్లో పూర్తి స్థాయి నీటి మట్టంతో కళకళలాడుతున్నాయి. 0-25శాతం నీటి నిల్వతో 143 చెరువులు ఉన్నాయి. 25-50శాతం నీటి నిల్వతో 376 చెరువులు, 50-75శాతంతో 220 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో(ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ పరిధిలో) 1515 చెరువులుండగా 317 చెరువులు సోమవారం అలుగు పారినట్లుగా ఇరిగేషన్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 236 చెరువులు నూరు శాతం నీటి నిల్వతో నిండుకుండలా మారాయి. 0-25శాతం నీటి నిల్వతో 296 చెరువులు కొట్టుమిట్టాడుతుండగా 357 చెరువుల్లో 25-50శాతం మేర నీరు వచ్చి చేరింది. 50-75శాతం నీళ్లతో 309 చెరువులున్నాయి. రికార్డు స్థాయిలో సోమవారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 390 చెరువులు అలుగు పారడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద జలాలు చేరుకోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సారెస్పీ ఇరిగేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగువ నుంచి వస్తోన్న లక్షలన్నర క్యూసెక్కుల వరదను నియంత్రించేందుకు 9 గేట్ల ద్వారా ఉదయం 10గంటలకు 25వేల క్యూసెక్కులు వదిలారు. వరద పెరగడంతో 16గేట్లు ద్వారా 76,867 క్యూసెక్కులకు ఔట్‌ఫ్లో పెంచారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 24గేట్లను తెరిచి 75వేల క్యూసెక్కుల వరదను నదిలోకి విడిచి పెట్టారు. ఈ వానాకాలం సీజన్లో ఎస్సారెస్పీ గేట్లు తెరుచుకోవడం తొలిసారి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని 80 టీఎంసీలుగా కుదించింది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 1091 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి 1089 అడుగులకు పోచంపాడ్ ప్రాజెక్టు చేరింది. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 74.425 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. రెట్టింపు స్థాయిలో మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు పంపుతున్నారు. కందకుర్తి త్రివేణి సంగమం భయానకంగా మారింది. ఓ వైపు మంజీరా వరద, ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తోన్న గోదావరి సంగమించడంతో కందకుర్తి శివాలయం సంపూర్ణంగా మునిగింది. నందిపేట ఉమ్మెడ ఉమామహేశ్వరాలయం వద్ద గోదావరి నది ఉగ్రరూపాన్ని సంతరించుకుంది.