e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home నిజామాబాద్ సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!

సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!

సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!
  • ధాన్యం సేకరణలో ఉభయ జిల్లాలు టాప్‌
  • కరోనా కష్టకాలంలోనూ సాఫీగా కొనుగోళ్ల ప్రక్రియ
  • కేంద్రాలకు పోటెత్తుతున్న ధాన్యం
  • రైతు బ్యాంక్‌ అకౌంట్లోకి నేరుగా డబ్బులు జమ
  • ఉభయ జిల్లాల్లో 5లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం సేకరణ

కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఏడాదిగా కొవిడ్‌ కారణంగా ప్రభుత్వ ఆదాయ మార్గాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను చేపట్టింది. పుష్కలంగా వర్షాలు కురవడం.. భూగర్భ జలాలు పెరగడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయం, 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాతో ఉమ్మడి జిల్లాలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అన్నదాతకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నది. ధాన్యం కొనుగోలు చేసిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాష్ట్రంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు ధాన్యం సేకరణలో ముందంజలో దూసుకుపోతున్నాయి. కొనుగోళ్లు, చెల్లింపుల్లో యంత్రాంగం వేగంగా స్పందిస్తుండడంతో మిగిలిన జిల్లాల కన్నా మెరుగైన గుర్తింపును ఉభయ జిల్లా దక్కించుకుంటుండడం విశేషం.

నిజామాబాద్‌, మే 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడాది కాలంగా వెంటాడుతున్న కంటికి కనిపించని కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచమంతా పోరాటం చేస్తున్నది. వైరస్‌ విస్తృతితో వ్యవస్థలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ప్రభుత్వాలకు ఆదాయ మార్గాలు, రా బడులు సైతం తగ్గుతున్నాయి. ఈ దీన పరిస్థితిలో దేశంలోని అనేక రాష్ర్టాల్లో సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కష్టతరంగా మారింది. రాష్ట్రంలో మాత్రం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు సాఫీగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా రూ.వేల కోట్లు వెచ్చించి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆరుగాలం కష్టించి పండించిన రైతుల పంట ఉత్పత్తులను ప్రభుత్వమే సేకరిస్తున్నది. కరోనా మహమ్మారి ఓ వైపు నుంచి తరుముతున్నా ఈ గడ్డు కాలంలోనూ అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు సీఎం కేసీఆర్‌ ధైర్యంగా ముందడుగు వేశారు. రైతులకు మద్ద తు ధర కల్పించాలనే ధృడ సంకల్పంతో ధాన్యాన్ని ప్ర భుత్వమే సేకరిస్తున్నది.
ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ధాన్యాన్ని సర్కారు కొనుగోలు చేసి రైతు ఖాతా ల్లో రెండు, మూడు రోజుల్లోనే డబ్బులను జమ చేస్తుండడం గమనార్హం. రాష్ట్రంలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా లు ధాన్యం సేకరణలో ముందంజలో దూసుకుపోతున్నాయి. కొనుగోళ్లు, చెల్లింపుల్లో యంత్రాంగం వేగంగా స్పందిస్తుండడంతో మిగిలిన జిల్లాల కంటే మెరుగైన గు ర్తింపును ఉభయ జిల్లా దక్కించుకుంటుండడం విశేషం.

సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!
- Advertisement -


కష్టకాలంలో జోరుగా కొనుగోళ్లు…
అతి సూక్ష్మమైన వైరస్‌ మూలంగా అనేక దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది వైరస్‌ సోకి అనారోగ్యానికి గురవుతున్నారు. విపత్కర సమయంలోనూ రైతులకు మేలు చేయాలని, వారికి అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కష్టపడి పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు పటిష్టవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఇబ్బంది లేకుండా, వైరస్‌ వ్యాప్తి జరుగకుండా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సూచనల మేరకు ధాన్యం కొనుగోళ్లకు ఉభయ జిల్లాల పౌరసరఫరాల అధికారులు కృషి చేస్తున్నారు. అన్నదాతకు కరోనా కష్టాలు దరి చేరనీయకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కర్షకులు పండించిన పంట ఉత్పత్తులను చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో 419 కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 307 కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రా రంభించారు. జోరుగా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఎలాం టి అవాంతరాలు లేకుండా ఉండేందుకు రెవెన్యూ, పో లీసు, రవాణా, పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలతో నిత్యం సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
రాష్ట్రంలోనే టాప్‌…
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తున్న జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టాప్‌లో ఉంది. నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా కామారెడ్డి జిల్లా ఆ తరువాతి స్థానంలో నిలుస్తోంది. ముందు నుంచి పకడ్బందీ ప్రణాళిక, పక్కా కార్యాచరణతో యంత్రాంగం పని చేస్తుండడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాఫీగా ధాన్యం సేకరణ జరుగుతోంది. కరోనా కఠోర సమయంలోనూ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 5లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని అధికార యంత్రాంగం సేకరించింది. నిజామాబాద్‌ జిల్లాలో 3లక్షల 31వేల 707 మెట్రిక్‌ టన్నులు, కామారెడ్డి జిల్లాలో లక్షా 28వేల 435 మెట్రిక్‌ టన్నులు మేర ధాన్యాన్ని రైతులు విక్రయించారు. వీటి మొత్తం రెండు జిల్లాల్లో కలిపితే దాదాపుగా రూ.863కోట్లుగా ఉంది. నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు రూ.622కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొన్నారు. కామారెడ్డి జిల్లాలో రూ.241 కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు సాఫీగా సేకరించారు. ఇప్పటి వరకు 50వేల మంది రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించుకున్నారు. రెండు వారాల్లోగా ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరనుంది.
యాసంగిలో వరి సాగు భళా…
యాసంగి సీజన్‌లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో వరి సాగు భారీగా పెరిగింది. గతంలో యాసంగి పంటలు పండించాలంటే రైతులు వెనుకా ముందు ఆలోచించేవారు. భూగర్భ జలాలు, జలాశయాల్లో నీటిని ఆధారంగా చేసుకుని ముందడుగు వేసేవారు. లేదంటే భూమి ఉన్నప్పటికీ సాగు నీటి గోస మూలంగా పంటలు వేసేందుకు రైతన్నలు వెనుకడుగు వేయక తప్పకపోయేది. సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. యాసంగి సీజన్‌లో ఉభయ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట అధికంగా సాగవ్వడంతో ధాన్యం ఇబ్బడిముబ్బడిగా తరలి వస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో 3లక్షల 4వేల 398 ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపుగా ఎనిమిదిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2లక్షల 33వేల 197 ఎకరాల్లో వరి సాగు చేయగా 5లక్షల 84వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో 40వేల ఎకరాలు ఎక్కువగా వరి సాగు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 60వేల ఎకరాల్లో అధికంగా వరిని సాగు చేయడం విశేషం.

రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దు…
వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. చివరి గింజ వరకూ సేకరించే బాధ్యత మాదే. రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కనీస ప్రమాణాలు పాటించి రైతులందరూ కనీస మద్దతు ధరను పొందాలి. చెల్లింపుల్లోనూ జాప్యం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిర్ణీత కాల వ్యవధిలోనే రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులుంటే అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వీలైనంత వేగంగా ధాన్యాన్ని సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.

  • చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌, నిజామాబాద్‌.

కరోనా గడ్డు కాలంలోనూ సాఫీగా కొనుగోళ్లు…
కరోనా వైరస్‌ విస్తృతిలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ధాన్యాన్ని సేకరిస్తున్నాం. ఎక్కడా ఏ చిన్న ఫిర్యాదు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే తరలించడంతో పాటుగా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నాం.

  • జితేంద్ర ప్రసాద్‌, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌, కామారెడ్డి .
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!
సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!
సిరుల ఖిల్లా.. ఉమ్మడి జిల్లా…!

ట్రెండింగ్‌

Advertisement