BJP | న్యూఢిల్లీ, మే 3: ‘బేటీ బచావో.. బేటీ పఢావో’.. కేంద్రంలోని మోదీ సర్కారు ఇచ్చిన నినాదమిది. అయితే స్వయంగా బీజేపీనే ఈ నినాదానికి నిలువునా తూట్లు పొడుస్తున్నది. లైంగికదాడి నిందితులకు ఆ పార్టీ అండగా నిలుస్తున్నది. ఇటీవల పరిణామాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ గురించి కమలం పార్టీకి ముందే తెలిసినా, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ కుమారుడికి లోక్‌సభ టికెట్ ఇచ్చింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటన్న ప్రజ్వల్.. జేడీఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, ఆయన బీజేపీ కూటమిలో భాగంగా హసన్ ఎంపీగా పోటీచేశారు. ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ వ్యవహారం బీజేపీకి ముందే తెలుసునని, ఆ పార్టీకి చెందిన నేత ఒకరు గత ఏడాది డిసెంబర్లోనే హెచ్చరించినప్పటికీ అధిష్ఠానం పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ గత నెల 14న మైసూర్లో జరిగిన ర్యాలీలో ప్రజ్వల్ రేవణ్ణతో వేదిక పంచుకొన్నారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే రేపాయి. దీనిపై పలువురు ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయినా బ్రిజ్‌భూషణ్‌పై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ లోక్‌సభ సీటు అభ్యర్థితాన్ని ఇన్ని రోజులుగా నాన్చిన బీజేపీ.. ఇప్పుడు ఆ స్థానాన్ని బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు కేటాయిస్తూ గురువారం ప్రకటించింది.
యూపీలోని ఉన్నావోలో 17 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ 2018లో అరెస్టు అయ్యాడు. 2019లో ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అయితే అంతకుముందు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఎమ్మెల్యే సెంగార్‌పై బీజేపీ చర్యలు తీసుకోకపోవడంపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత జైల్లో ఉన్న సెంగార్‌ను బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ కలిశారు.
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో 8 ఏండ్ల బాలికపై జరిగిన లైంగిక దాడి హత్య కేసులో నిందితుడైన పోలీసు అధికారి దీపక్ ఖజూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 2018లో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ శర్మ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
యూపీలోని హత్రాస్‌లో 19 ఏండ్ల దళిత యువతి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తుల చేతుల్లో సామూహిక లైంగిక దాడి, హత్యకు గురైంది. అయితే ఈ ఘటనలో బాధిత యువతి మృతదేహాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా, బాధిత కుటుంబసభ్యులు లేకుండానే రాత్రికి రాత్రే దహనం చేయించింది.
2022, సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్‌లో అంకిత్ భండారి అనే 19 ఏండ్ల యువతిని బీజేపీ నేత వినయ్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య ఓ రిసార్టులో హత్య చేసినట్టు వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఈ కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై మహిళా హక్కుల సంఘాలు ప్రశ్నలు లేవనెత్తాయి.
మహిళపై నేరాల కేసుల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు- 44
దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు
2014- 3,37,922
2022- 4,45,256
పెరుగుదల- 31 శాతం
2022లో గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేసింది. ఈ కేసులో దోషులుగా ని ర్ధారణ అయిన 11 మందిని కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకొనే రెమిషన్‌పై విడుదల చేసినట్టు రాష్ట్ర సర్కార్ 2022, అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే గుజరాత్ ప్రభుత్వ ఉత్వర్వులను సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో కొట్టివేసింది.
మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపు, లైంగిక దాడి ఘటన జరిగి ఏడాది అయింది. ఈ ఘటనలో బాధితులు తమను కాపాడాలని పోలీసుల వద్దకు వెళ్తే.. వాళ్లే మహిళలను మూకకు అప్పగించారని సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్నది. అయితే గత ఏడాది మే 3న మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభం కాగా.. దేశ ప్రధానిగా ఉన్న మోదీ 78 రోజుల తర్వాతకు గానీ నోరు విప్పలేదు. ఇప్పటికీ ఆయన రాష్ట్రంలో పర్యటించలేదు.