| హైదరాబాద్, మే 3 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల భారత్ అప్పుల కుప్పగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 వరకూ కేంద్రం రూ.155.6 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇందులో 30 శాతం వరకూ దీర్ఘకాలిక రుణాలు ఉన్నాయి. 2014కు ముందు కేంద్రం చేసిన అప్పు రూ.58.6 లక్షల కోట్లు కాగా, మోదీ ప్రధాని అయిన తర్వాత తొమ్మిదేండ్లలో చేసిన అప్పు రూ.97 లక్షల కోట్లకు పైగా ఉన్నది.
అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ.84 వేల కోట్ల అప్పులు చేస్తే, మోదీ ఏకంగా నెలకే దాదాపు రూ.93 వేల కోట్ల అప్పులు చేశారు. అసమర్థ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన బీజేపీ ప్రభుత్వం.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకవైపు ఎడాపెడా అప్పులు చేయడమే కాదు.. పేద, మధ్యతరగతి వర్గాలకు ఇస్తున్న సబ్సిడీలు తగ్గించింది. అంతటితో ఆగకుండా వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై వాత పెడుతున్నది. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
చేసిన అప్పులకు గానూ కేంద్రం పెద్దయెత్తున వడ్డీలు చెల్లిస్తున్నది. 2014-15లో తీసుకొన్న రుణాలకు రూ.4.02 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించగా, 2021-22లో రూ.8.14 లక్షల కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరం రూ.9.4 లక్షల కోట్లను చెల్లించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రూ.10.8 లక్షల కోట్లను వడ్డీగా చెల్లించనున్నట్టు సమాచారం. ఈ లెక్కన ప్రతినెల రూ.90 వేల కోట్ల చొప్పున కేంద్రం వడ్డీల రూపంలో చెల్లిస్తున్నది.


