ఇందల్వాయి, మే 3 : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఇందల్వాయి మండలంలోని గన్నారం, మెగ్యానాయక్ తండా, స్టేషన్ తండా, సిర్నాపల్లి, నల్లవెల్లి, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ..గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, రూ. 4వేల పింఛన్, రైతుబంధు రూ.15 వేలు, యువతకు ఎలక్ట్రిక్ స్కూటీలు, మహిళలకు రూ.2,500 పథకాలను వందరోజుల్లో అమలుచేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి నాలుగునెలలవుతున్నా వాటిని అమలుచేయడంలేదని, గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. జవాబు చెప్పలేక తిరిగి పారిపోతారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీడీ కార్మికులకు పెన్షన్, రైతుబంధు, రైతుబీమా, సీఎంఆర్ఎఫ్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఏ ఒక్క పథకాన్ని అమలుచేసే దమ్ములేదు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని మండిపడ్డారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో అర్వింద్ గెలిచిన ఐదురోజుల్లో పసుపుబోర్డు తెస్తానని, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని అబద్ధాలు చెప్పి ప్రజలు, రైతులను మోసం చేశాడని విమర్శించారు. మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. తాను గెలిస్తే గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ పాలసీతోపాటు పసుపు బోర్డును తీసుకువస్తానన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటినా ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడంలేదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలోనే ప్రతి ఒక్కరికీ పక్కాగా సంక్షేమ పథకాలు అందాయని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బాజిరెడ్డి గోవర్ధన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ రమేశ్ నాయక్, జడ్పీటీసీ సుమనారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసు, జాయింట్ సెక్రటరీ పులి శ్రీనివాస్, ఎంపీటీసీలు లావణ్య, సుధీర్, బాబురావు, సీహెచ్.దాసు, శ్రీను, సుధాకర్, క్రాంతి, అంబర్‌సింగ్, బీరేశ్, సాంబారు శ్రీకాంత్, బీఆర్ఎస్ అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.