బాల్కొండ/వేల్పూర్/భీమ్‌గల్, మే 3: అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్, నాగపూర్, వేల్పూర్ మండలం రామన్నపేట్, భీమ్‌గల్ మండలం బాబాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతుగా శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, దీంతో మళ్లీ ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో 50 ఏండ్లలో జరగని అభివృద్ధి పదేండ్లలో చేసి చూపించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చి వందరోజుల్లో అమలుచేస్తామని చెప్పిందని గుర్తుచేశారు. ఆ హామీల అమలుపై ఇప్పటివరకు స్పందన లేదని, అడిగితే ఆగస్టు 15లోగా అమలుచేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ హామీలతో మహిళలు, రైతులు, యువతను నమ్మించి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఏనాడూ మన మంచి చెడులకు రాలేదని, ఎమ్మెల్సీగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేయడానికి యత్నిస్తోందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎంపీ అర్వింద్ ఐదేండ్లయినా పసుపు బోర్డు తీసుకురాలేదన్నారు. పంట సాగు తగ్గి పసుపు ధర పెరిగిందని, ఇందులో అర్వింద్ చేసిన కృషి ఏమీలేదన్నారు. గెలిపించిన ప్రజలకు ఏమీ చేయకుండా రాముడు, మోదీ పేరుమీద ఓట్లు అడుగుతున్న వారికి కర్రు కాల్చివాత పెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజల మనిషి అని అన్నారు. ప్రజల పక్షాన పోరాడడానికి ఆయనను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.