Rahul Gandhi | న్యూఢిల్లీ, మే 3: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓటమి భయం వెంటాడుతున్నదా? ఒక్క ఓటమికే అమేథీలో పోటీకి భయపడ్డారా? గత ఎన్నికల్లో అమేథీలో ఎదురైన పరాభవం ఈసారి వయనాడ్‌లోనూ చూడబోతున్నారా? అందుకే ముందు జాగ్రత్తగా రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగుతున్నారా? రాహుల్ గాంధీ వ్యవహారశైలి చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాని మోదీ మొదలు కొని స్మృతి ఇరానీ దాకా భాగ్ రాహుల్ భాగ్ అంటూ ఎద్దేవా చేశారు.
వయనాడ్‌లో ఎన్నికలు పూర్తయ్యే వరకు రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్న విషయాన్ని బయట పెట్టకుండా వయనాడ్ ప్రజలను సైతం రాహుల్ గాంధీ మోసం చేశారని వారు ఆరోపించారు. అమేథీ, వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించారని, ఓటమి భయంతో ఆయన పరుగులు తీస్తున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాగా, శుక్రవారం నామినేషన్లకు చివరి రోజున రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కిశోరీలాల్ శర్మ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వెంట రాగా రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు. 2004లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009, 2014లోనూ ఆయన అమేథీలో విజయం సాధించారు. 2019లో స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమిని ముందే గ్రహించిన రాహుల్.. ఆ ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌లోనూ పోటీ చేసి, విజయం సాధించి పరువు కాపాడుకున్నారు.
ఈసారి కూడా ఆయన వయనాడ్ నుంచి పోటీ చేశారు. రెండో స్థానంగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, మూడుసార్లు గెలిచిన తన సొంత నియోజకవర్గం లాంటి అమేథీని వదిలేసి రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడాన్ని బీజేపీ విమర్శిస్తున్నది. వయనాడ్‌లో ఓటమి భయంతో రెండో స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని, అమేథీ అయితే మళ్లీ ఓడిపోతారనే రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేస్తున్నది.
గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని అమేథీలో ప్రజలు ఓడించినా కేరళలోని వయనాడ్ ప్రజలు మాత్రం అక్కున చేర్చుకొని 4.31 లక్షల భారీ మెజారిటీతో గెలిపించారు. ఈసారి వయనాడ్‌లో త్రిముఖ పోటీ నెలకొన్నది. రాహుల్ గాంధీకి సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా, బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో ఓటమి భయంతోనే రాయ్‌బరేలీ నుంచి కూడా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నేతలు రెండుచోట్ల పోటీ చేయడం పెద్ద తప్పేమీ కాదు కానీ ఈ విషయంలో రాహుల్ గాంధీ వ్యవహారశైలి విమర్శలకు తావిస్తున్నది.
వయనాడ్‌లో ఏప్రిల్ 26న ఎన్నికలు పూర్తయ్యాయి. అక్కడ పోలింగ్ పూర్తయ్యే వరకు ఆయన రాయ్‌బరేలీలో పోటీ విషయాన్ని బయట పెట్టలేదు. రెండుచోట్ల పోటీ చేస్తున్నాననే విషయాన్ని ముందే వెల్లడించకుండా ఓట్లు అడగడం వయనాడ్ ప్రజలను మోసం చేయడమే అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయ్‌బరేలీలో పోటీ చేయాలనే ఆలోచన రాహుల్‌కు ముందే ఉందని, వయనాడ్‌లో పోలింగ్ అయిపోయే వరకు ఈ విషయాన్ని దాచిపెట్టి ప్రజలకు అన్యాయం చేశారని అన్నీ రాజా విమర్శించారు. వయనాడ్‌లో తన కోసం పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ గాంధీ వెర్రివాళ్లను చేశారని సురేంద్రన్ విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీ రెండుచోట్ల గెలిస్తే ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏ నియోజకవర్గానికి రాజీనామా చేస్తారో ముందే చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేస్తున్నారు.
అమేథీలో ఓడిపోయి వయనాడ్ వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ కూడా ఓడిపోతాడనే భయంతోనే రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వయనాడ్‌లో పోలింగ్ తర్వాత ఓటమి భయంతో ‘యువరాజు’ మరో స్థానాన్ని వెతుక్కుంటారని తాను ముందే చెప్పానని ఆయన గుర్తు చేశారు. ‘భయపడకు, పారిపోకు’ అని రాహుల్ గాంధీకి మోదీ హితవు పలికారు. కాగా, అమేథీలో ఎన్నికల బరి నుంచి గాంధీ కుటుంబం తప్పుకోవడం ద్వారా పోలింగ్‌కు ముందే కాంగ్రెస్ పార్టీ అమేథీలో ఓటమిని అంగీకరించిందని కేంద్రమంత్రి, అమేథీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ విమర్శించారు. వయనాడ్‌కు వెళ్లి అక్కడి ప్రజలను తన కుటుంబసభ్యులుగా రాహుల్ గాంధీ చెప్పుకున్నారని, ఇప్పుడు రాయ్‌బరేలీలో ఏం చెప్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీలో నామినేషన్ సందర్భంగా తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. అందులో తెలిపిన వివరాల ప్రకారం రాహుల్ పేరున రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అందులో రూ. 4.2లక్షల విలువైన బంగారం కూడా ఉంది. అయితే తన పేరున ఎలాంటి నివాస ఫ్లాట్ కానీ, కారు కానీ లేదని తెలిపారు. ఇక అప్పులు రూ.49,79,184 ఉన్నాయి. చరాస్తులు రూ. 9,24,59,264, స్థిరాస్తులు రూ.11,15,02,598 ఉన్నాయి. రాహుల్ విద్యార్హతలు పరిశీలిస్తే యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ట్రినిటీ కాలేజీ నుంచి ఎంఫిల్ డిగ్రీ, ఫ్లోరిడాలోని రోలిమ్స్ కాలేజీ నుంచి బ్యాచ్‌లర్ డిగ్రీ అందుకున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో తనపై 18 కేసులున్నట్టు వెల్లడించారు.
వయనాడ్‌లో ఓడిపోయినా కచ్చితంగా గెలిచే స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతోనే రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడి నుంచి ఇందిరా గాంధీ మూడుసార్లు, ఆమె భర్త ఫిరోజ్ గాంధీ రెండుసార్లు గెలుపొందారు. 2004, 2009, 2014, 2019లో సోనియా గాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్‌బరేలీ బరి నుంచి తప్పుకున్నారు. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతోనే రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని ఎంపిక చేసుకున్నారు.