Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్‌లో పేదల ఇండ్లను వందలాది మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఈ రాక్షస కాండను ఆయన ఎక్స్ ద్వారా మంగళవారం ఖండించారు. ‘ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా?’ అని నిలదీశారు. నాలుగు జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులను మోహరించి, యుద్ధ వాతావరణం సృష్టించి, ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించారు. పేదలు తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా? అని నిలదీశారు. ‘పోలీసులను అడ్డం పెట్టుకొని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారు అంటేనే.. మీరు చేస్తున్న అరాచకం గురించి లోకానికి తెలియకూడదు అనే భయం పట్టుకున్నదని అర్థమవుతున్నది. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడుతారు. అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు.. నేడు ఉన్న ఇండ్లను కూడా కూలగొట్టి నిరుపేదలను నడిరోడ్డుపై నిలబెట్టిండు’ అని నిప్పులు చెరిగారు.
గుండె తరుక్కుపోతున్నది
ఇండ్లు కూలి పేదలు రోదిస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో కష్టపడి, రూపాయిరూపాయి పోగేసి కట్టుకున్న ఇండ్లను ఎలాంటి నోటీసులివ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాధితుల ఆత్మఘోష ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తేల్చిచెప్పారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సర్కార్‌కు హితవు పలికారు. ‘పేదల గూడు చెదిరితే.. మీ అధికార గద్దెలు కూడా అంతే వేగంగా కూలిపోతయ్.. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు.