ఢిల్లీ : ఖరీఫ్ సీజన్ ( Kharif Season )లో తెలంగాణ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ఎరువులు,యూరియా ( Urea ) ను అందించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju ) కేంద్ర ప్రభుత్వా న్ని కోరారు. క్లిష్ట సమయంలో పంట ఎదుగుదల, వ్యవసాయ ఉత్పాదకతను కాపాడటా నికి ఎలాంటి అంతరాయం లేని ఎరువులను అందించడం అత్యవసరమని అన్నారు.
రాజ్యసభ జీరో అవర్లో గురువారం ఆయన మాట్లాడారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడడంతో రైతులు ఎరువుల కోసం గంటల తరబడి పొడవైన లైన్లలో నిలబడాల్సి వచ్చిందని, అనేక చోట్ల ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.
లైన్లలో నిలబడి వేచి ఉన్న సమయంలో రైతులు స్పృహతప్పి పడిపోయిన, తోపులాటలో ప్రాణాలు కూడా కోల్పోయిన విషాదకర సంఘటనలు చోటు చేసుకు న్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది ఎదురైన అనుభవం, ప్రణాళిక, సమన్వయం, ఎరువుల సకాలంలో పంపిణీలో ఉన్న తీవ్రమైన లోపాలను బయటపెట్టిందని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.
రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి పదేపదే హెచ్చరికలు చేసినా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణకు అదనపు పరిమాణంలో యూరియాను వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరడం జరిగిందని ఎంపీ వద్దిరాజు చెప్పారు.ఈ విజ్ఞప్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అదనపు నిల్వలను విడుదల చేయడంతో పరిస్థితి కొంతవరకు మెరుగు పడడం జరిగిందన్నారు. సకాలంలో చేసిన ఆ జోక్యాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో యూరియా డిమాండ్ సరఫరాను నిశితంగా పరిశీలించాలని, వాస్తవ క్షేత్రస్థాయి అవసరాల ఆధారంగా తగినంత సకాలంలో కేటాయింపులు జరిగేలా చూడాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లా, మండల స్థాయిలలో తగినంత బఫర్ నిల్వలను నిర్వహించాలని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించాలని కేంద్రాన్ని కోరారు.