హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఖమ్మం వెలుగుమట్లలో పదేండ్లుగా నివసిస్తున్న పేదల ఇండ్లను కూల్చడం దారుణమని యూసీసీఆర్ఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి వినోద్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వందలాది మంది పోలీసులను మోహరించి పెద్ద సంఖ్యలో బుల్డోజర్లతో ఇండ్లు కూల్చడం అంటే ప్రజలపై యుద్ధం ప్రకటించడమే అని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలక పార్టీకి చెందిన కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు. బాధితులకు భూములు తిరిగి ఇవ్వాలని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.