ఖలీల్‌వాడి ఏప్రిల్ 7 :జిల్లా కేంద్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండడం, మరోవైపు ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడంతో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఉభయజిల్లాల్లో వందలాది కేసులు నమోదవుతుండడం ఆందోళనకలిగిస్తున్నది. సంఖ్యాపరమైన వృద్ధితోపాటు సామూహిక కార్యక్షేత్రాల్లో ఒకేచోట పదులసంఖ్యలో కేసులు బయటపడుతుండడం గమనార్హం. నిర్లక్ష్యధోరణిని వీడి తగిన జాగ్రత్తలు పాటిస్తేనే కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని వైద్యనిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజూ పదిలోపే నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు.. వారం రోజులుగా వందకు చేరువవడం కలవరం కలిగిస్తోంది.
వ్యక్తిగతంగా కరోనాబారిన పడినవారికన్నా సామూహికంగా వైరస్‌ను కొనితెచ్చుకుంటున్న ఉదంతాలు కోకొల్లలు. నిజామాబాద్ నగరంలోని బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్న 80మందికి ఇటీవల కరోనా సోకినట్లు సమాచారం. నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్ సమీపంలో ఉన్న 30మంది, గుండారం సమీపంలోని ఓ పేపర్‌మిల్లులో 40మంది కరోనా బారినపడినట్లు సమాచారం. తాజాగా నగరంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆరుగురు సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. పని ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించకపోవడంతోనే కరోనా విజృంభిస్తున్నదని వైద్యులు చెబుతున్నారు. మరో నాలుగువారాలపాటు రెండో దశ కరోనా కేసులు ఉధృతంగా నమోదు కావచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాం గం కూడా అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా కరోనా కేసులను కట్టడి చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో దండోరా వేయిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడమే కాకుండా మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు పోలీసుశాఖ కూడా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నది.
తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందే
జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలి. ఆరోగ్య విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వస్తే వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-డాక్టర్ ప్రతిమారాజ్, జీజీహెచ్ సూపరింటెండెంట్
ఇవీ కూడా చదవండీ…
7 సార్లు గెలిచినా.. తాగునీరివ్వలేదు
రైతు సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయం