e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 19, 2021
Advertisement
Home Top Slides వాగుల్లో గంగమ్మ పరవళ్లు

వాగుల్లో గంగమ్మ పరవళ్లు

వాగుల్లో గంగమ్మ పరవళ్లు
  • కాళేశ్వర జలాలతో కాల్వల్లో జలసవ్వడులు
  • నీటిని చూసి మురిసిపోతున్న రైతాంగం
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, ఏప్రిల్‌7 : కాళేశ్వర జల తరంగంతో నిండు వేసవిలోనూ వాగులు పరవళ్లు తొక్కుతుండగా.. చెరువులు నిండుకుండల్లా మారుతున్నాయి. మండు ఎండల్లో తమ గ్రామాలకు తరలివచ్చిన గోదావరి జలాలను చూసి రైతన్నలు సంబురపడుతున్నారు. ఎల్లంపల్లి పంప్‌హౌస్‌ నుంచి పరుగులు తీస్తున్న గోదావరి జలాలు కరీంనగర్‌ జిల్లా గంగాధరలోని నారాయణపూర్‌ మీదు గా వేములవాడ, చందుర్తి, రుద్రంగి మండలాలను తడుపుతున్నాయి. ఇప్పటివరకు వేములవాడ మండలంలోని 7 చెరువులు, చందుర్తి, రుద్రంగి మండలాల్లో 30 చెరువులు నిండాయి. చందుర్తి మండలంలోని బండపెల్లి రిజర్వాయర్‌ నిండి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో బుధవారం నక్కవాగుకు జలకళవచ్చింది. చందుర్తి మండలంలోని మూడపల్లి చెరువు అలుగుపారుతున్నది. అన్నపూర్ణ ప్రాజెక్టు సర్ఫేజ్‌ గేట్ల ద్వారా వారం రోజులుగా వస్తున్న నీటితో ఇల్లంతకుంట మండలం అనంతారం చెరువు నిండుకుండలా మారింది.

కాళేశ్వర జలవిప్లవం.. మెట్టకు జీవం

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో అద్భుత జల దృశ్యం ఆవిష్కృతమైంది. మండల కేంద్రంలోని పెద్ద చెరువు కాళేశ్వర జలాలతో బుధవారం మత్తడి దూకింది. వర్షాధారం.. అదీ కొద్దోగొప్పో నీరు మాత్రమే చేరి పంటలకు అడపాదపడా నీరందించిన చెరువు నిండుకుండలా మారి, జలసవ్వడి చేస్తున్నది. 12.67 ఎంసీఎఫ్‌టీ నీటి నిల్వ సామర్థ్యంతో దాదాపు 443 ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువు ఎన్నడూ పూర్తిస్థాయిలో నీరందించిన దాఖలాలు లేవు. కానీ, జల విప్లవ సృష్టికర్త సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంతో మండే ఎండల్లోనూ పెద్ద చెరువు మత్తడి దుంకుతుంది. మల్లన్నసాగర్‌ తుక్కాపూర్‌ పంప్‌హౌస్‌ నుంచి మార్చి 4న బయలు దేరిన కాళేశ్వర జలాలు చెరువుకు చేరి అలుగు పారుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్ద చెరువు నిండడంతో ఈప్రాంత వాసులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హల్దీవాగులో పరుగులు

మంగళవారం గజ్వేల్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం అవుసులపల్లి వద్ద హల్దీవాగులోకి, పాములపర్తి వద్ద గజ్వేల్‌ కెనాల్‌లోకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేయడంతోనే గోదావరి జలాలు పరుగుపరుగున చెరువుల్లోకి చేరుతున్నాయి. బుధవారం 11 గంటలకు బంధం చెరువు నిండి మత్తడి దూకింది. అక్కడి నుంచి కాలువ ద్వారా పెద్దచెరువులోకి చేరుకుంటున్నాయి. వర్గల్‌ పెద్ద చెరువు నిండి శాకారం ధర్మాయ చెరువులోకి పరుగులు తీస్తున్నాయి. అలాగే గజ్వేల్‌ కెనాల్‌ ద్వారా పాములపర్తి రెడ్డికుంట నిండి పెద్దచెరువులోకి నీరు పారుతున్నాయి. శుక్రవారం పెద్దచెరువు నిండి పటేల్‌కుంటలోకి అలుగుపారే అవకాశం ఉన్నది. గజ్వేల్‌ కెనాల్‌ నుంచి ప్రజ్ఞాపూర్‌ ఊర చెరువులోకి కూడా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్‌ జలాలతో వర్గల్‌ మండలం చౌదరిపల్లి బంధం చెరువు నిండి అలుగు పారడంతో రైతులతో కలిసి నాచారం లక్ష్మీనృసింహ్మస్వామి ఆలయ కమిటీ సభ్యుడు పడిగె రాజు, మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు గోదావరి జలాలకు పూజలు చేశారు. రైతులంతా జైకేసీఆర్‌, జైతెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాగా ఏయే చెరువులు, కుంటలు నిండాయి. కాలువల్లో ఎంత వరకు వెళ్లాయి అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

గున్కుల్‌లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ సాగర్‌ ద్వారా నిజాంసాగర్‌కు మళ్లించిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని గు న్కుల్‌ గ్రామానికి చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఆయకట్టు రైతులు బుధవారం క్షీరాభిషేకం చేశారు.

ఇది చారిత్రక ఘట్టం మంత్రి కేటీఆర్‌ ట్వీట్

వాగుల్లో గంగమ్మ పరవళ్లురాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ పెద్ద చెరువు కాళేశ్వరం జలాలతో నిండడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొంటూ మంత్రి కేటీఆర్‌ తన సంతోషాన్ని బుధవారం ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. ‘తెలంగాణ వస్తే ఏం వస్తుంది అన్న వారికి గంగమ్మ పరవళ్లతో ఆనందం కురిపించింది’ అంటూ పెద్ద చెరువు ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

14న చలో హాలియా

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్‌

జిల్లాలకు ఆర్టీసీ కార్గో

మాసాయిపేటను ముద్దాడనున్న గోదావరి

అంతర్జాతీయ జర్నల్‌లో మన పోలీస్‌ ఆర్టికల్‌

లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య

మత్స్యశాఖలో అవినీతి చేపలు

మా సర్వీసును క్రమబద్ధీకరించండి

Advertisement
వాగుల్లో గంగమ్మ పరవళ్లు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement