డిచ్పల్లి, మార్చి 11: మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పలు చానళ్లలో వచ్చిన వార్తలను ఆయన సోమవారం ఖండించారు. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం చేస్తున్నారని, అవన్ని అసత్య ఆరోపణలని కొట్టి పడేశారు. వాటిని నమ్మొద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.
మాజీ సీఎం కేసీఆర్ తనకు మూడుసార్లు టికెట్ ఇచ్చి అవకాశం కల్పించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండుసార్లు గెలిచానని, ఒకసారి ఓడినంత మాత్రాన పార్టీ మారుతానని అనుకోవద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కొందరు నాయకులు పార్టీకి ద్రోహం చేసినట్లు తాను చేయబోనన్నారు. ‘ఇదంతా కుట్రలో భాగంగానే దుష్ప్రచారం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తా. టికెట్ వచ్చినా, రాకున్నా పార్టీని వీడేది లేదు. లైఫ్ ఇచ్చిన వారికి ద్రోహం చేయను. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడొద్దని’ సూచించారు.