ఖలీల్‌వాడి, మార్చి23: ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ. దీనిపై అవగాహన లేకపోవడంతో ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి సోకే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలియక వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ముఖ్యంగా ఈ వ్యాధికి గతంలో పూర్తిస్థాయిలో నయమయ్యేందుకు మందులు అందుబాటులో ఉండేవి కావు. కానీ ప్రస్తుతం అత్యంత సులువుగా వ్యాధి తీవ్రతను బట్టి తొమ్మిది నెలలు, సంవత్సర కాలం వైద్యంతో పూర్తిగా నయం అవుతోంది. ఈ క్షయ (టీబీ) వ్యాధి గతంలో నయంకాని వ్యాధిగా పరిగణించేవారు. టీఈ అంటేనే జనాలు గజగజ వణికేవారు. కానీ ఇప్పుడు క్షయను ప్రాథమిక దశలోనే గుర్తిసే నివారణ అత్యంత సులువని, మందుల వాడడంలో నిర్లక్ష్యం వీడితేనే నివారణ సాధ్యమని వైద్యులు చెబుతున్నారు.
నియంత్రణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానం
క్షయ వ్యాధి నియంత్రణలో రెండేండ్లుగా నిజామాబాద్ జిల్లా మొదటిస్థానంలో ఉండడం గమనార్హం. ఈ ఏడాది కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా టీబీ కో-ఆర్డినేటర్ రవిగౌడ్, జిల్లా అధికారి సుదర్శనం పురస్కారం అందుకున్నారు. శుక్రవారం ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా కూడా అవార్డులను అందుకోనున్నారు.
వ్యాధి నిర్ధారణ
క్షయ వ్యాధిని మొదటి దశలో ఉదయం వ్యాధిగ్రస్తుడు ఉమ్మిన తెమడను పరీక్షించి నిర్ధారిస్తారు. ఎక్స్‌రే ద్వారా కూడా నిర్ధారించవచ్చు. కల్చర్ పరీక్ష ద్వారా క్షయ వ్యాధిని కచ్చితంగా నిర్ధారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సీబీనాట్ అనే పరీక్ష ద్వారా రెండు గంటల్లో వ్యాధిని నిర్ధారించవచ్చు. సీబీనాట్ పరీక్షా విధానంలో తెమడ పరీక్ష కాకుండా మిగతా నమూనాలు అన్నింటిని తీసుకుని పరీక్ష చేస్తారు. తద్వారా సత్వర నిర్ధారణతోపాటు ఈ పరీక్ష ద్వారా ఎండీఆర్, టీబీగా నిర్ధారణ అయితే వెంటనే వైద్యాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.
ఎండీఆర్ టీబీ అంటే..
క్షయ నిర్ధారణ అనంతరం వ్యాధిగ్రస్తుడు వైద్యులు సూచించిన సమయం వరకు టీబీ మందుల కోర్సు వాడకపోవడం లేదా సోకిన క్షయను ప్రాథమిక దశలో గుర్తించకపోవడం, వ్యాధి ముదిరితే దానిని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ (ఎండీఆర్ టీబీ) అంటారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి సంబంధిత క్రీములు శక్తివంతంగా మారడం మూలన వాటిపై మందులు పని చేయవు. ఇలా ఎండీఆర్ టీబీగా నిర్ధారించిన రోగికి 24 నెలల పాటుగా వ్యాధి నివారణకు సంబంధించిన కోర్సు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఈ ఎండీఆర్ టీబీ వ్యాధిగ్రస్తుల్లో క్రమం తప్పకుండా మందులు వాడినా ఫలితం 40 నుంచి 45 శాతం మందినే కాపాడుతుందని, మిగతా వారిని కాపాడలేమని వైద్యులు చెబుతున్నారు.
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లో టీబీ
హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు టీబీ సోకే అవకాశం మెండుగా ఉంటుంది. 60 శాతం హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఈ క్షయ సోకుతుంది. వీరిలో ఒక్కరోజు కన్నా ఎక్కువ దగ్గు, జ్వరం ఉన్నా, రాత్రివేళల్లో చెమటలు వచ్చినా, అకారణంగా నీరసం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే వారికి టీబీ సోకినట్లు చెప్పవచ్చును. వీరు హెచ్ఐవీకి వాడే మందులతో పాటు టీబీ నివారణ మందులను క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పుట్టిన పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇప్పించాలి. దగ్గినా, తుమ్మినా నోటికి గుడ్డ లేదా రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మరాదు. ఎక్కువ ప్రొటీన్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లో 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వారికి వైద్యుడి సలహామేరకు ఐసోనియోజైడ్ మందులను ఇప్పించాలి. వ్యాధి లక్షణాలు తగ్గినట్లు అనిపిస్తే మందులను మధ్య వాడడం మానివేయరాదు. వ్యాధిని తీవ్రత మేరకు మందుల వాడకం వైద్యులు వ్యాధి నిర్ధారణ ప్రకారం మందుల వాడకాన్ని నిర్ణయిస్తారు.
క్షయ వ్యాధిని మూడు కేటగిరిలో నిర్ధారిస్తారు. కేటగిరి -1 వ్యాధిగ్రస్తులకు 6, 7 నెలల వరకు, కేటగిరి -2 వారికి 8 ,9 నెలల వరకు, కేటగిరి -3 అయితే 24 నుంచి 27 నెలల వరకు క్రమం తప్పకుండా మందులను వాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వైద్యులు టీబీ నివారణ సిబ్బంది పర్యవేక్షణలో డాట్స్ అనే కాంబిప్యాక్ మందులను ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు వాడే క్రమంలో ఒక్కరోజు కూడా మందులను వాడడం ఆపరాదు.
జిల్లాలో నిర్ధారణ కేంద్రాలు – చికిత్స కేంద్రాలు
క్షయవ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలోని పలు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో డిజిగ్నేటేడ్ మైక్కోస్కోపి సెంటర్లు 16 ఉన్నాయి. ముఖ్యంగా 1. జిల్లా జనరల్ దవాఖాన, అర్బన్‌లో క్షయ నియంత్రణ కేంద్రాల్లో, 2. మాలపల్లి అర్బన్, 3. ఆర్మూర్ సీహెచ్‌సీ, 4. నందిపేట్ పీహెచ్సీ, 5. బాల్కొండ పీహెచ్సీ 6. ప్రగతి దవాఖాన, 7. కమ్మర్పల్లి, 8. భీమ్గల్లి, 9. డిచ్పల్లి, 10. వర్ని, 11. ధర్పల్లి, 12. కోటగిరి, 13 . బోధన్, 14. నవీపేట్, 15. ఎడపల్లి, 16. మెడికల్ కళాశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
చికిత్స కేంద్రాలు
1. నిజామాబాద్ అర్బన్ : జనరల్ దవాఖానలోని క్షయ నియంత్రణ కేంద్రం, నాల్గో అంతస్తు. 2. ఆర్మూర్, 3. వర్ని, 4. నందిపేట్, 5. డిచ్పల్లి, 6. బాల్కొండ, 7. మోర్తాడ్, 8. ధర్పల్లిలో చికిత్స కేంద్రాలు ఉన్నాయి.
క్రమం తప్పకుండా మందులను వాడాలి
క్షయ వ్యాధి ఈరోజుల్లో మందుల వాడకంతో సులువుగా నివారించే వ్యాధి. వ్యాధి నిర్ధారణ అనంతరం వైద్యుడు సూచించినన్నీ రోజులు మందులు క్రమం తప్పకుండా వాడాలి. మందుల వాడకంతో పాటు ప్రొటీన్ పదార్థాలు, పోషకాహార పదార్థాలను తీసుకొవాలి. మందుల వాడే సమయంలో ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ మందులను ఆపకూడదు. మందుల వాడకం ఆపితే మందులు ఆ వ్యక్తికి పని చేయకుండా పోతాయి. అలాంటప్పుడు మందుల వాడకం ఆపిన వ్యక్తిని రక్షించడం కష్టతరమౌతుంది. అవగాహనతోనే ఈ వ్యాధిని నయం చేయవచ్చు.
– డాక్టర్ రాజేశ్వర్ (పాల్మనాజిస్ట్)
టీబీ నియంత్రణలో జిల్లా మొదటి స్థానం
నిజామాబాద్‌ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత ఆరోగ్య వివరాల పట్టికతో జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను సేకరిస్తున్నారు. అందులో టీబీ వ్యాధిగ్రస్తులను పూర్తి స్థాయిలో గుర్తించి టీబీ వ్యాప్తిని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో టీబీ నిర్ధారణ అయిన వ్యక్తుల పేర్లు, వివరాలు తీసుకొని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేసేలా చర్యలు తీసుకున్నాం. డయోగ్నోస్టిక్ సెంటర్లో టీబీ నిర్ధారణ అయిన వ్యక్తుల పేర్లు, వివరాలు అలాగే మెడికల్ షాపులలో టీబీ మందులను కొనుగోలు చేసి వాడే వారి వివరాలను సేకరించి చర్యలు తీసుకున్నాం.
– సుదర్శనం, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి