హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills By-Election) ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి గడువు ముగియనుంది. సాయంత్రం 5 తర్వాత మైకులు, నేతల ప్రచారాలు బంద్ కానున్నాయి, ఆంక్షలు మొదలు కానున్నాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం వెలువడనుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత కారు గుర్తుపై పోటీచేస్తుండగా, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితోపాటు మరో 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని 4,01,365 మంది ఓటర్లు తేల్చనున్నారు. ఉపఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 226 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 139 డ్రోన్లతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 తర్వాత 144 సెక్షన్ అమల్లోకి రానుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉన్న పోలింగ్ సమయాన్ని తొలిసారిగా మరో గంట పాటు పొడిగించారు. 11న పోలింగ్ ఏడు గంటల నుంచి ప్రారంభమై ఆరు గంటల వరకు కొనసాగనున్నది. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక ఓటరూ ఓటును వినియోగించుకోనున్నారు. క్యూ లో ఎంత మంది ఉన్నా, ఎంత సమయం పట్టినా, అందరూ ఓట్లు వేసిన తర్వాతే పోలింగ్ ప్రక్రియ ముగించి, ఈవీఎంలను ఏజెంట్ల సమక్షంలో సీజ్ చేసి, రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు తరలించనున్నారు.
కాగా ఉప ఎన్నిక, జనరల్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటిస్తారు. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని ఎప్పటికప్పుడు ఎన్నికల విభాగం అధికారులు సిఫార్సులు చేస్తున్నా, ప్రైవేటు సంస్థలు అంతంత మాత్రంగానే అమలు చేస్తున్నాయి. కానీ సరారు ఆఫీసులకు సెలవును ప్రకటించినా, కొందరు ఓటర్లు హాలీ డేను ఎంజాయ్ చేయటం తప్ప, ఓటింగ్‌లో పాల్గొనని సందర్భాలు సైతం లేకపోలేవు. ఐతే ఈ సారి ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని స్వీప్ కార్యక్రమాల ద్వారా విస్తృత అవగాహన కల్పించిన ఎన్నికల విభాగం అధికారులు, మరో పక్క గంట పాటు పోలింగ్ సమయాన్ని పెంచడం పై పోలింగ్ శాతం గతంలో కంటే పెరిగే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.