బూర్గంపహాడ్, మార్చి 17 : సర్పంచుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మేజర్ పంచాయతీ సారపాకకు చెందిన గుగులోత్ కిశోర్ శివరాంనాయక్ ఎన్నికయ్యారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో రాష్ట్ర సంఘం బాధ్యులు ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సారపాక పంచాయతీ నుండి కిశోర్ భారీ మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై మరింత బాధ్యత పెరిగిందని, రాష్ట్ర సంఘం ఇచ్చిన ఈ పదవికి వన్నెతెచ్చేలా జిల్లాలో సర్పంచులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ ఎన్నికయ్యారు.