సారంగాపూర్, నవంబర్ 8: నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ), గుం డారం గ్రామాల శివారు ప్రాంతాల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో మొరం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అన్న చందంగా సాగుతున్నది. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా మొరం అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మొరం అక్రమ రవాణా విషయం తెలిసినా.. సంబంధిత శాఖల అధికారులు చూసి చూడనట్లుగా ఉంటూ.. తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
నామ్ కే వాస్తే వే బిల్లులు..
ప్రభుత్వ నిబంధనల మేరకు రెవెన్యూ అధికారులు ఇచ్చే వే బిల్లుల ఆధారంగా నిర్దేశించిన టిప్పర్ల ద్వారా మొరం తరలించాల్సి ఉంటుం ది. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా కొన్ని వే బిల్లులు మాత్రమే మొరం దందా వ్యాపారులు తీసుకుని రోజులు గడిచినప్పటికీ అవే వే బిల్లులను చూయిస్తూ.. రోజుకు వందలాది సంఖ్యల టిప్పర్లలో అక్రమ మొరం రవాణా చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. తవ్వకాలు జరిపే ప్రదేశంలో రెండు మూడు చోట్ల సోలార్ లైట్లు ఏర్పాటు చేసుకుని రాత్రిపూట కూడా అక్రంగా మొరం తరలిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ తవ్వకాలు చేపట్టిన మొరాన్ని టిప్పర్ల ద్వారా జగ్గరావు ఫారం, జాన్కంపేట్ మీదుగా నిజామాబాద్, బోధన్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
అక్రమంగా మొరం రవాణా చేస్తున్నారని ప్రజావాణిలో ఇంతకుముందు కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల మల్కాపూర్(ఏ) శివారులో మొరం తవ్వకాలు చేపట్టవద్దని ఆ గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారు. దీంతో పక్కనే ఉన్న గుండారం శివారులో మొరం తవ్వకాలు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. మొరం అక్రమ రవాణా సాగుతున్నదని ఇటీవల బీజేపీ నాయకులు, కార్యకర్తలు మల్కాపూర్(ఏ) శివారు ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ మొరం రవాణాను అరికట్టాలని కలెక్టర్‌ను కోరారు. అయినా మొరం తవ్వకాలు ఇప్పటికీ జోరుగానే సాగుతున్నాయి. ఇకనైనా మొరం అక్రమ తవ్వకాలు అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని గుండారం, మల్కాపూర్(ఏ) గ్రామస్తులు కోరుతున్నారు.
మల్కాపూర్(ఏ) శివారులో వే బిల్లులు ఇస్తున్నాం..
మల్కాపూర్(ఏ) శివారులో వ్యవసాయ పట్టా భూమిలో మొరం తవ్వకాలకు వే బిల్లులు ఇస్తున్నాం. అయితే ఒకేసారి పది రోజులకు సరిపడా ఇవ్వకుండా రెండు మూడు రోజులకు సరిపడా వే బిల్లులు ఇస్తున్నాం. వే బిల్లుల ఆధారంగానే మొరం తీసుకెళ్లాలని సూచిస్తున్నాం. అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే చర్యలు తీసుకోక తప్పదు.
-ఇన్చార్జి తహసీల్దార్ వినయ్‌సాగర్
పట్టా భూమిలోనే తవ్వకాలు జరుపుతున్నాం..
వ్యవసాయ పట్టా భూమి సాగుకు అనుకూలంగా లేదని మొరం తవ్వకాలు చేపట్టి పంట సాగుకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతున్నది. ఒడ్డెర వృత్తిని నమ్ముకున్న తాము వే బిల్లుల ద్వారానే మొరాన్ని తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మొరాన్ని విక్రయిస్తున్నాం. దీని ద్వారా ఉపాధి పొందుతున్నాం.
-మొరం దందా వ్యాపారులు